24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీహార్‌లో కులగణన… సర్వే వివరాలను వెల్లడించిన నితీష్ సర్కార్!

పాట్నా : దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బీహార్‌ కులగణన సర్వే వివరాలు నిన్న  విడుదలయ్యాయి. జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా బీహార్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఈ నివేదిక, రాష్ట్ర జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి)లు, అత్యంత వెనుకబడిన తరగతులు (ఇబిసి)లు కలిసి 63 శాతానికి పైగా ఉన్నారని, ఎస్సీలు 19 శాతం దాకా ఉన్నారని తేల్చింది.

ఈ తాజా నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం ఒబిసిలు 27.13 శాతం, ఇబిసిలు 36.01 శాతం ఉన్నారు. యాదవ, కుర్మి, కుష్వాహ తదితర కులాలను ఒబిసి కేటగిరి కింద సర్వేలో నమోదు చేశారు. ఎస్‌సిలు 19.65శాతం ఉండగా, ఎస్‌టిలు 1.68 శాతం ఉన్నారు. జనరల్‌ లేదా అగ్ర కులాలకు చెందిన జనాభా 15.52 శాతంగా ఉన్నారు.

కులాలవారీగా చూస్తే యాదవులు అధికంగా ఉన్నారు. రాష్ట్ర మొత్తం జనాభాలో వీరు 14.26 శాతంగా ఉన్నారు. ఆర్జేడీకి కోర్‌ ఓటు బ్యాంక్‌గా వీరిని సాధారణంగా పరిగణిస్తారు. కుష్వాహ్‌లు 4.21, కుర్మీలు 2.87 శాతం ఉన్నారు. అగ్ర కులాల్లో బ్రాహ్మిణులు అధికంగా ఉన్నారు. బీహార్‌ మొత్తం జనాభాలో వీరిది 3.6 శాతం. రాజ్‌పుత్‌లు 3.15 శాతం, భూమిహార్లు 2.86 శాతం ఉన్నారు.

కుల సర్వేలో కులంతో సహా 17 పాయింట్ల సామాజిక-ఆర్థిక సూచికలు ఉన్నాయి. దాదాపు 2.64 లక్షల మంది ఎన్యూమరేటర్లతో 29 మిలియన్ల నమోదిత కుటుంబాల వివరాలను డాక్యుమెంట్ చేయడంతో ఈ ఏడాది ఆగస్టులో మూడు దశల కసరత్తులో ఇది పూర్తయింది. సర్వేలో పేర్కొన్న 214 కులాలకు వేర్వేరు వ్యక్తిగత కోడ్‌లను కేటాయించారు.

ఈ నివేదిక ఆధారంగా అన్ని తరగతుల ప్రజల అభ్యున్నతికి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు తగు ప్రణాళికలు రూపొందిస్తామని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ చెప్పారు. సర్వే బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కుల ఆధారిత సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం ఉందని ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఈ సర్వే నివేదిక వివరాల గురించి తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం తొమ్మిది రాజకీయ పార్టీలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నాయకులు తేజస్వి యాదవ్‌ ఈ సందర్భాన్ని ‘చారిత్మ్రాక క్షణం’గా అభివర్ణించారు. ‘కుల గణన డేటాను సంకలనం చేసి అతి తక్కువ వ్యవధిలోనే విడుదల చేయడం గొప్ప విషయమన్నారు. బీహార్‌ ఇప్పడు ఒక గీతను గీసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ ఈ కుల గణన నివేదికను స్వాగతించారు. బిసి, ఎస్సీ, ఎస్టీలు మొత్తంగా కలిపి 88 శాతం అంటే మూడింట రెండొంతులకు పైగా ఉన్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 90 మంది సెక్రటరీలు ఉంటే వారిలో బిసిలు కేవలం ముగ్గురే ఉన్నారని కేంద్ర బడ్జెట్‌లో వీరికి 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారని రాహుల్‌ అన్నారు. ఈ రీత్యా కులగణన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన చెప్పారు.

బీహార్‌లోని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) కుల సర్వేకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని అన్నారు. కులాల సర్వేకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

బీహార్ ప్రభుత్వం జనవరి 7న రెండు దశల కులాల సర్వేను ప్రారంభించింది. ఈ సర్వే వారి కులంతోపాటు కుటుంబాల ఆర్థిక స్థితిగతులను నమోదు చేసింది. బీహార్‌లోని 38 జిల్లాల్లోని 12.70 కోట్ల జనాభా కోసం సామాజిక-ఆర్థిక డేటాను సేకరించినట్లు అంచనా.

కేంద్ర ప్రభుత్వం 2011లో సామాజిక- ఆర్థిక- కుల గణన (ఎస్‌ఇసిసి 2011) పేరుతో కులాల వివరాలను సేకరించింది. అయితే ఈ సమాచారాన్ని బయటకు వెల్లడించకుండా తొక్కిపట్టింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles