23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

మతోన్మాద దాడులు ఇంకెంత కాలం?

దేశంలో దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపాలని, జైశ్రీరామ్ నినాదాన్ని దుర్వినియోగం చేయవద్దని షుమారు 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఒక ఉత్తరం రాశారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, సినీ నిర్మాతలు శ్యామ్‌ బెనెగల్‌, అపర్ణాసేన్‌, గాయని శోభా ముద్గల్‌ సహా , బెంగాలీ సినీ ప్రముఖుడు సౌమిత్రో ఛటర్జీ, దక్షిణాది సినీనటి రేవతి, సామాజిక కార్యకర్త బినాయక్‌ సేన్‌, సామాజిక శాస్త్రవేత్త ఆశిస్‌ నంది లాంటి ప్రముఖులు కూడా లేఖపై సంతకాలు చేశారు.

‘జై శ్రీరామ్‌’అనే పవిత్ర నామాన్ని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మార్చారని వారు ఆ లేఖలో వాపోయారు. ఈమధ్యన మణిపూర్ సహా అనేక రాష్ట్రాల్లో కూడా మానవత సిగ్గుతో తల దించుకొనే సంఘటనలు జరిగాయి. కానీ పాలక వర్గాలకు చీమకుట్టినట్లుకూడా లేదు. కనీసం ప్రధాని మోడీ మణిపూర్ ను నేటివరకు సందర్శించలేదు. రావణ కాష్టం ఇంకా అక్కడ రగులుతూనే ఉంది. గతంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా అనేక మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ..రోజురోజుకూ విస్తరిస్తోన్న మతోన్మాదాన్ని,’పేలడానికి సిధ్ధంగా ఉన్న అణుబాంబు’తో పోల్చారు.

నిజానికి భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఎన్నోకులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, సంప్రదాయాలు అనాదిగా ఇక్కడ సహజీవనం చేస్తున్నాయి. మనదేశంలో ఉన్నన్ని కులాలు, మతాలు ప్రపంచంలోని ఏ దేశంలోనూలేవు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటున్న ఏకైక దేశం భారతదేశమే. ఒకేదారంలో రకరకాల పుష్పాలు ఒదిగినట్లుగా, పూల వనంలో రంగురంగుల పూలు గుబాళిస్తున్నట్లుగా పాలూ పంచదార లాంటి సహజీవనం మనదేశ ప్రత్యేకత. భారత దేశ ప్రజలు స్వతహాగా శాంతి కాముకులు. మత సామరస్యానికి, మానవీయ విలువలకు పెట్టిందిపేరు. కలుపుగోలుతనం, కలసిపంచుకునే తత్వం ఇక్కడి ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంతటి అద్భుతమైన సామరస్య, సోదరభావ సహజీవనానికి, శాంతియుత వాతావరణానికి, తూట్లుపొడిచే కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నరేంద్రమోడీ ప్రధాని పీఠం అధిరోహించిన తరువాత ఇలాంటి ఘటనలు అధికమయ్యాయి.

ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి…పేరు ఏదైతేనేం ..అనేక సంఘటనలు ఒకదాని తరువాత మరొకటి, ఒకటి మరువక ముందే మరొకటి వరుసగా పథకం ప్రకారం కొనసాగుతున్నాయి. దేశ సమైక్యతను, సామరస్య వారసత్వాన్ని ఛిన్నాభిన్నం చేసే పైశాచిక కుట్ర ప్రణాళికా బద్దంగా, చాపకింద నీరులా సాగిపోతోంది.

మొన్నటికి మొన్న తబ్రేజ్ అన్సారీని కొట్టిచంపిన అదే ఝార్ఖండ్ లో, సి.పి సింగ్ అనే భా.జ.పా మంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక ముస్లిం శాసన సభ్యుడి భుజం తట్టి ‘బోలో జై శ్రీరామ్ ‘(జైశ్రీరామ్ నినాదం చెప్పాలని) అంటూ ఒత్తిడి చేశాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి,అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతున్న ఒక శాసన సభ్యుడి దగ్గరకు వెళ్ళి, జై శ్రీరామ్ అని గట్టిగా నినదించమని ఒత్తిడి చేశాడంటే, ఇక ఆపార్టీ వీర భక్తులు ఊరుకుంటారా?అందుకే పట్ట పగ్గాల్లేకుండా రెచ్చిపోయి భీభత్సం సృష్టిస్తున్నారు.స్వయంగా ఏలిన వారి మాటలు, చేతలు, వారి ప్రవర్తనే అల్లరి మూకలకు ప్రేరకాలుగా పని చేస్తున్నాయి. పాలక పక్షం అండదండలు లేకుండా ఈస్థాయిలో విజృంభించడం ఉండనే ఉండదు.

గతంలో అల్వార్ లో రఖ్బార్ ను చంపిన మూక తమకు, తమ స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉందని ప్రకటించుకోవడం కూడా దీనికి నిదర్శనం. ఝార్ఖండ్ లోని రాంఘడ్ లో ఒక మాంసం వ్యాపారిని కొట్టిచంపిన కేసులో దోషులుగా తేలిన ఏడుగురు హంతకులను స్వయానా అప్పటి భా.జ.పా కేంద్ర పౌర విమానయాన మంత్రి జయంత్ సిన్హా కలుసుకొని అభినందించి, సన్మానం చేశాడు. జనం బీఫ్ తినడం మానేస్తేనే మూకోన్మాద హత్యలు ఆగుతాయని, అప్పటివరకు హత్యలు జరుగుతూనే ఉంటాయని ఇంద్రేశ్ కుమార్ అనే ఆరెస్సెస్ నేత ఖరాఖండిగా చెప్పాడు. అంటే, మూకోన్మాద హంతక ముఠాకు ఎవరి మద్దత్తు లభిస్తున్నదో, ఎవరి వత్తాసుతో, ఎవరి అండ చూసుకొని ఈ హత్యలు జరుగుతున్నాయో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది.

జో న బోలే గా జైశ్రీరామ్‌… ఉస్కో భేజ్ దో ఖబరస్థాన్‌’ అంటూ ఉన్మాద గీతాలు రచించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఇ ప్పుడిది దేశం నలుమూలలా వైరల్‌ అవుతున్న గీతం. జై శ్రీరామ్‌ అని నినదించని వారిని కాటికి పంపాలని ఉసిగొలుపుతూ సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ విద్వేష గీతం భయానక వర్తమానానికి అద్దం పడుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని చందౌలీలో ఓ పదిహేనేళ్ళ బాలుడి శరీరానికి నిర్ధాక్షిణ్యంగా నిప్పంటించిన ఘటన ఈ విద్వేష గీతం ప్రభావానికి ఒక తాజా నిదర్శనం. కుండలోని మంచినీళ్ళు తాగాడని దళిత విద్యార్ధిని కొట్టి చంపిన సంఘననూ కూడా మనం చూశాం. ఓగిరిజనుడి నోట్లో, నెత్తిమీద భాజపా కార్యకర్త మూత్రం పోసిన సంఘటన కూడా మనమింకా మర్చిపోలేదు. దళితులు, మైనారిటీలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు అంతకంతకూ అధికమవుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్న నిప్పులాంటి నిజాలు.

‘పరివార్ ‘శక్తులు తమ దీర్ఘకాల రాజకీయలబ్దికోసం మతోన్మాదాన్నిపెంచి పోషిస్తూ, సమాజాన్ని కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. భారతదేశ లౌకిక , ప్రజాస్వామ్య పునాదులను పెళ్ళగించి, మత రాజ్యాన్ని స్థాపించాలని కలలు గంటున్నాయి. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు, అధికారాన్ని తమకు అనుకూలంగా మలచుకొని ‘అనుకున్నవి’ సాధించుకోవాలని భవిష్య ప్రణాళికను రచించి, అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్య కాషాయీకరణకు ప్రధమ ప్రాధాన్యం ఇచ్చారు. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నడిచే శిశుమందిరాల్లో ‘శిశు’ దశనుంచే పసిమెదళ్ళలో విద్వేషం నూరిపోస్తున్నారు.’వనవాసీ కళ్యాణ పరిషత్’ పేరుతో ఆదివాసీ గిరిజన బిడ్డల మెదళ్ళలో విద్వేష విషం నింపుతున్నారు. ప్రారంభంలో కర్రసాముకు మాత్రమే పరిమితమైన ఆరెస్సెస్ శాఖలలో ఇప్పుడు బాంబులు, గన్నులు పేల్చే శిక్షణ కొనసాగుతోంది. పరివార్ శక్తుల ఈ దుష్ట పన్నాగానికి దేశంలోని మేధావివర్గం తీవ్రఆందోళనకు గురవుతున్నది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీకి ఉత్తరం రాసినా, ఇప్పుడు మోడీకి లేఖ రాసినా ఈదేశం, దేశ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయమే కారణం.

రాముడు మాకు ఆదర్శం, రామరాజ్య స్థాపనే మాలక్ష్యం అని చెప్పుకొనే పరివార్ మూక తాము గనక రామరాజ్యం స్థాపించ గలిగితే,’ఇదిగో ఆరాజ్యం లోని పరిపాలనా నమూనా ఇలా ఉంటుంది చూడండి.’అని దేశ ప్రజలకు ఇప్పుడే రుచి చూపిస్తున్నారు.

భక్తి ప్రపత్తులతో, తపోనిష్టతో , శాంత మనసుతో ఉచ్చరించవలసిన శ్రీరామ, హనుమ నామాలు ఇప్పుడు యుధ్ధ, ఉన్మాద నినాదాలుగా , ఒక మనిషిని మరో మనిషిపైకి ఉసిగొలిపి, ప్రాణాలు బలిగొనే ఆయుధాలుగా మారిపొయ్యాయంటే దేశంలో ఎంతటి భయానక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు, దేశంలోని అన్నివర్గాల ప్రజలు – ముఖ్యంగా మహిళలు, యువకులు,మేధావులు, సామాజిక కార్యకర్తలు ముంచుకొస్తున్న ప్రమాదానికి అడ్డుకట్టవేసే ప్రయత్నాలకు మరింత పదును పెట్టాలి. శాంతి, సామరస్యం, మానవీయ విలువల పరిరక్షణకు ప్రజాస్వామ్య, లౌకికవాద, వామపక్ష శక్తులు నడుంబిగించాలి. దళిత, ఆదివాసీ, మైనారిటీ బహుజనులంతా ఏకమై, ఐక్యకార్యాచరణ కు పూనుకోవాలి. ఇదినేటిఅవసరం. ఇప్పుడుమనముందున్న తక్షణకర్తవ్యం.

– యం. కారుణ్య, ఫ్రీలాన్స్ జర్నలిస్టు

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles