23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

“ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టం” – ఓ విశ్లేషణ..!

మన దేశ పౌరులందరికీ ఏక సారూప్యత గల ఓ ఉమ్మడి పౌరస్మృతి చట్టం తీసుకరావలసినదిగా , మన రాజ్యాంగంలోని *44వ అధికరణలో* పేర్కొనబడిన ఆదేశిక సూత్రం నిర్దేశిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే కదా,ఆ దిశగా జరిగిన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనంగా నిలచాయన్న సంగతి కూడా మనకు తెలుసు.

అంతెందుకు, దీనికోసం వేసిన లా కమిషన్ కూడా విశ్వప్రయత్నం చేసి ఇప్పుడిదంతా అవసరం లేని విషయమని తేల్చి చెప్పి చేతులెత్తేసిందన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి గానీ లేక ఆయన తన రాష్ట్రం కోసం ఉమ్మడి పౌరస్మృతి చట్టం ముసాయిదా ప్రతిని తయారు చేయడానికి వేసిన కమిటీకి గాని ఈ విషయాలు తెలివవని తెలుస్తుంది. లేకపోతే వాళ్లు జాతీయస్థాయిలో చేపట్టాల్సిన పనిని రాష్ట్రస్థాయిలో ఎలా చేపట్టగలరు? ఈ తప్పు చేసినందుకు వాళ్లు సిగ్గుపడేది పోయి! తమకు దేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా ఘనత దక్కిందని గర్వపడుతున్నారు.

దీనికి మించిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…ఇది సరైన పద్ధతి కాదని విమర్శించేది పోయి దీనిని ఆదర్శంగా తీసుకొని రాజస్థాన్ , గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మేము కూడా అతి త్వరలో యూసీసీ చట్టం తీసుకొస్తామని అమితోత్సాహన్ని కనబరుస్తున్నాయి.

ఒకవేళ ఇదే జరిగితే 28 రాష్ట్రాలకు ఏక సారుప్యత లేని 28 ఉమ్మడి పౌరస్మృతి చట్టాలు తయారవుతాయి తప్ప, అందులో జాతీయస్థాయి ఏక సారుప్యత ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.మరి అలాంటప్పుడు 44వ అధికరణలో పేర్కొనబడిన ఆదేశిక సూత్రంపై అమలు ఎలా జరుగుద్ది? అది జాతీయస్థాయి ఉమ్మడి పౌరస్మృతిని కోరుకుంటుంది తప్ప రాష్ట్రస్థాయిది కాదు.అంతెందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర యుసీసీ లోనే ఏకసారూప్యత లేదు.ఎందుకంటే అందులో షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వబడింది.మరి అలాంటప్పుడు దీన్ని ఉమ్మడి పౌరస్మృతి అని ఎలా అనగలరు?

మరో సమంజసమైన విషయం ఏమిటంటే వారు తమ రాష్ట్రంలో దాదాపు 14 శాతం జనాభా గల ముస్లింలకు కూడా షెడ్యూలు తెగల వలె మినహాయింపు ఇవ్వవచ్చు కదా? మరెందుకు ఇవ్వలేదు?వాళ్లు కూడా వాళ్ల రాష్ట్ర ప్రజలే కదా?మరి వారి పట్ల సవితి తల్లి ప్రేమ ఎందుకు?

నిజం చెప్పాలంటే వారి పట్ల ఉన్న ఏహ్యాభావమే ఈ UCC కి తెరదీసిందని చెప్పాలి. దీన్ని ఉమ్మడి పౌరస్మృతి చట్టం అనడం కన్నా మను పౌరస్మృతి చట్టం అని అనడమే సబబుగా ఉంటుందని చెప్పాల్సిఉంటుంది. రాష్ట్ర ప్రజల్లో కొందరిని ప్రేమించడం మరికొందరిని ఆసహించుకోవడం బిజేపి నాయకత్వానికే చెల్లు.

పైన జరిపిన చర్చ వల్ల ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చట్టపర పరిజ్ఞానం ఏ స్థాయిదో తేలిపోయింది.ఇక ఆయన చాలా జఠలమైన ఉమ్మడి పౌరస్మృతి చట్టం ముసాయిదాప్రతి తయారి కోసం వేసిన కమిటీ ఏ స్థాయిదో విశ్లేషించి చూద్దాం.

ఈ కమిటీని రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో నియమించారు.

ఆ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

1.రిటైర్డ్ జడ్జి పెర్మోద్ కోహ్లీ .

2.శత్రుఘ్న సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 3.మనుగౌర్ సామాజిక కార్యకర్త వృతిరీత్యా రైతు.

4. డాక్టర్ సురేఖ డంగ్వాల్ ఉపకులపతి డూన్ విశ్వవిద్యాలయం.

5. అజయ్ మిశ్రా (sec.Rc.U.K)

కమిటీ సభ్యుల జాబితా పై ఓ చూపు వేసినట్లయితే మనకు అర్థమయ్యేదేమిటంటే మొత్తం సభ్యుల్లో కేవలం ఇద్దరే న్యాయ శాస్త్ర పరిజ్ఞానం కలవారు. మిగతా నలుగురు సభ్యులకు న్యాయశాస్త్ర పరిజ్ఞాన నేపథ్యం లేదు.

కొద్దిగా వివరాల్లోకి వెళితే మనకు తెలిసేదేమిటంటే

  • శత్రుఘ్న సింగ్ పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి, ఇంజనీరింగ్ లో ప్రావీన్యుడు.ప్రస్తుత రామ మందిర నిర్మాణ కమిటీలో ఓ సభ్యుడిగా ఉన్నాడు.
  • అలాగే మనుగౌర్ ఓ సామాజిక కార్యకర్త, ఈయన వృత్తిరీత్యా ఓ రైతు.
  • మరో సభ్యురాలు అయిన డాక్టర్ సురేఖ డాంగ్వాల్ ఉపకులపతి, డూన్ విశ్వవిద్యాలయం. ఈమె భాషా ప్రావీణ్యురాలు.
  • అలాగే అజయ్ మిశ్రా ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఓ కార్యదర్శి అని తెలుస్తోంది.

ఈ వివరాల అధ్యయనం వల్ల మనకు సునాయాసంగా అర్థమయ్యేదేమిటంటే ముఖ్యమంత్రి ధామీకి ఈ సమస్య పట్ల బొత్తిగా చిత్తశుద్ధి లేదు , ఉంటే న్యాయ శాస్త్రంతో సంబంధం లేని వారిని ఈ కమిటీలో చేర్చేవాడు కాదు.

దీనికి మరొక నిదర్శనం ఏమిటంటే దాదాపు 14% జనాభా గల ముస్లింల వ్యక్తిగత చట్టాల్లో ప్రావీణ్యం పొందిన ఒక్క సభ్యునికి కూడా స్థానం కల్పించలేదు.ఒకవేళ స్థానికంగా అలాంటి నిపుణుడు లేనిచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకోవచ్చు కదా! ఎందుకంటే ఈ కమిటీలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే, స్థానికులు కారు.

జాతీయస్థాయిలో ముస్లిం న్యాయ శాస్త్ర నిపుణులకు కొదవలేదు.అందులో ఒకరు పదవి విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కలీముల్లా గారు,ఈయనను సుప్రీంకోర్టు “బాబ్రీ మసీదు- రామ జన్మభూమి” కమిటీలో సభ్యునిగా పెట్టింది.

అలాగే డాక్టర్ తాహెర్ మహమూద్ అంతర్జాతీయ స్థాయి న్యాయశాస్త్ర నిపుణుడు.ఈయన రాసిన పుస్తకాలకు దేశ విదేశాల్లో మాన్యత ఉంది.

కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ముస్లింలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి లేదు కనుక ఇలాంటి ముస్లిం న్యాయ శాస్త్ర నిపుణులకు కమిటీలో స్థానం కల్పించలేదు. అందుకే ఈ దుస్థితి. “ముస్లిం పర్సనల్ లా” ను అంతముందించడమే బిజెపి ఆశయము కనుక వారి నుండి మనకు మేలు కలుగుతుందని ఆశించడం తప్పు.

దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు కూడా ఈ దుస్థితి ఉండేది కాదు. దేశ పౌరులందరికీ తమ తమ మతాచారాల ప్రకారం వ్యక్తిగత జీవితం గడుపుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఆ స్వేచ్ఛను నేడు ప్రజల నుండి లాక్కోవడం జరుగుతుంది.

ఈరోజు ముస్లింలకు ఎదురవుతున్న ఈ సమస్య రేపు షెడ్యూల్ కులాలకు&తెగలకు, వెనుకబడిన కులాలు కూడా చవిచూడాల్సివస్తుందని గ్రహించి ఐక్యమత్యంతో కార్యోన్ముఖులు కావాలని కోరుకుందాం.

— యూసుఫ్ అస్కరి

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles