30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

యూపీలో ప్రశ్నాపత్రాలు లీక్…కానిస్టేబుల్ పరీక్ష రద్దు చేసిన సీఎం యోగి ఆతిధ్యనాథ్!

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్ నియామ‌కాల రాత ప‌రీక్షను యూపీ ప్రభుత్వం రద్దు చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిరసన బాట పట్టారు. దీంతో యోగి ప్రభుత్వం దిగి వచ్చింది. ఆరు నెలల్లో మళ్లీ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాదు పేపర్ లీక్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిబద్ధత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

వారం రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్‌ నియామక పరీక్షకు దాదాపు 48 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.  యువత ఆశలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి వికృత చర్యలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెబుతాం. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసులు ఇప్పటి వరకూ 240 మందికి పైగా అరెస్టు చేశారని సీఎం యోగి పోస్టులో తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేయడం ద్వారా ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. కేసును ఎస్టీఎఫ్ ద్వారా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దోషులుగా తేలిన వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.

పేప‌ర్ లీక‌వ‌డం ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసింది. ల‌క్నోలో అభ్య‌ర్థులు భారీగా రోడ్డెక్కారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌టంతో ఈ అంశం రాజ‌కీయ రంగు పులుముకుంది.

పరీక్ష రద్దుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ యువశక్తి ముందు ప్రభుత్వం తల వంచాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకేజీ భాజపా ప్రభుత్వంలోని అవినీతికి నిదర్శనం మాత్రమే కాదు. ఇది పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యమని విమర్శించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం కొత్త పరీక్ష తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… “ఇప్పటివరకు పేపర్లు లీక్ కాలేదన్న భాజపా నాయకులు ఇప్పుడు రద్దు చేశారు. అధికారులు, నేరస్థులు కుమ్మక్కయ్యారని, ఇందులో ప్రభుత్వ హస్తం కూడా ఉందని అర్థమవుతోంది. ఇదంతా భాజపా ఆడుతున్న నాటకమని యువతకు అర్థమైందన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో బీహార్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రీషెడ్యూల్ చేసిన పరీక్ష కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles