33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ముస్లింలపై ప్రధాని కడుపుమంట… కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం!

జైపూర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముస్లింలపై తన అక్కసును వెళ్లగక్కారు.  దేశంలో వ్యక్తిగత సంపదనంతా ముస్లింలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ యత్నిస్తుందని మోడీ ఆరోపించారు. దేశంలోని వనరులపై ముస్లింలకే తొలి హక్కు అని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించిందని అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌, బనస్వరా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థుల తరుపున మోడీ ప్రచారం నిర్వహించారు.

ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని, హిందువులు, ముస్లింల మధ్య విభజనను సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చింది. కాగా  2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో  క్లిప్‌ను బీజేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది, అందులో దేశంలోని వనరులపై ముస్లింలదే మొదటి హక్కు అని ఆయన చెప్పడం వినవచ్చు.

అంతకుముందు రోజు ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్‌ను “అర్బన్ నక్సల్” పార్టీ అని అన్నారు.

‘ఈ అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచన నా తల్లులు, చెల్లెళ్ల దగ్గర ఉన్న బంగారం లెక్క తీస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చెప్తున్నది. ఈ సంపదను పంచేస్తారు.  నా తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలను కూడా వదలదు’ అని మోదీ పేర్కొన్నారు. మీ కష్టార్జితాన్ని చొరబాటుదారులకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా?’ అని ప్రశ్నించారు. కాగా మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తప్పుబట్టింది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హిందూ, ముస్లిం అనే పదాలనే పొందుపర్చలేదని ఆ పార్టీ నేత పవన్‌ ఖేరా పేర్కొన్నారు.

ప్రధాని మోదీ  తన స్థాయిని మరిచి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, “మొదటి దశ ఓటింగ్‌లో నిరాశకు గురికావడంతో, భయంతో ఇప్పుడు ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్లించాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీది  ‘విప్లవాత్మక మేనిఫెస్టో’ అని ఈ ఎన్నికల్లో దేశం తన సమస్యలపై ఓటు వేస్తుంది,  ఉపాధి,  కుటుంబ భవిష్యత్తు కోసం ఓటు వేస్తుంది” అని రాహుల్ గాంధీ X (గతంలో ట్విట్టర్ ) లో రాశారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles