33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి…10 మంది మృతి, 30 మందికి గాయాలు!

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో  యాత్రికులు ప్రయాణిస్తున్న బుస్సపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో  బస్సు  డ్రైవర్‌ గాయపడ్డంతో అది  కాస్త అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.  ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు యాత్రీకులతో శివ్‌ ఖోరి కేవ్‌ మందిరానికి వెళ్తుండగా  దాడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సు లోయలోకి పడిపోయిందని రైసీ సీనియర్‌ ఎస్‌పి మోహితా శర్మ తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి యాత్రీకులను రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సరిహద్దు జిల్లాలు రాజౌరీ, ఫూంచ్‌ జిల్లాతో పోలిస్తే రైసీ జిల్లాలో ఉగ్రవాద కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి జిల్లాలో ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు.

ఈ సంఘటనలో ప్రత్యక్ష  సాక్షి ఒకరు మాట్లాడుతూ..ఈ దాడిలో  ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారని,  బస్సు లోయలో పడిపోతున్నా… వారు కాల్పులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. యాత్రికుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారుగా భావిస్తున్నారు.

గత మూడు దశాబ్దాల్లో జమ్మూ-కశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. గతంలో 2017 జూలైలో కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.

యాత్రికులపై ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.. జమ్మూ- కశ్మీర్‌లో ఆందోళనకరంగా ఉన్న భద్రత పరిస్థితుల వాస్తవ రూపాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనతోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles