24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ52… కౌంట్‌డౌన్‌ షురూ!

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Isro) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ52 (PSLV C52) రాకెట్‌ను ప్రయోగించనుంది. దీనికోసం ఆదివారం (నేడు) తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 25.30 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. సోమవారం ఉదయం 5.29 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ52 నింగిలోకి దూసుకెళ్లనుంది.  పీఎస్‌ఎల్‌వీ-సీ52 వాహక నౌక ఇది 1710 కిలోల బరువు ఉన్న ఆర్‌ఐశాట్ ‌(ఈవోఎస్‌-04), 17.5 కిలోల ఐఎన్‌ఎస్‌-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని విద్యార్థులు రూపొందించారు. యూఎస్‌లోని కొలరాడో బౌల్డర్‌ విశ్వవిద్యాలయంలోని లాబొరేటరీ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ అండ్‌ స్పేస్‌ ఫిజిక్స్‌, నేషనల్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, తైవాన్‌, సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నాలజికల్‌ విశ్వవిద్యాలయం, తిరువనంతపురంలోని ఐఐఎస్‌టి సహకారంతో రూపకల్పన చేశారు. కాగా, శుక్రవారం రాత్రి 11.59 నుంచి శనివారం ఉదయం 5.59 గంటల వరకు నిర్వహించిన రిహార్సల్‌ విజయవంతమైంది.              సోమవారం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సీ52(పీఎస్ఎల్వీ) వాహక నౌక ప్రయోగం నేపథ్యంలో ఇస్రోలోని అన్ని కేంద్రాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డాక్టర్ సోమనాథ్ తొలిసారి శనివారం ‘షార్‘కు విచ్చేశారు. రోజంతా తీరిక లేకుండా గడిపారు. ఉదయం 9 గంటలకు చెన్నై నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల బందోబస్తు మధ్య ‘షార్‘కు చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం షార్లోని వసతులను పరిశీలించారు. కాన్ఫరెన్స్ హాలుకు చేరుకుని అవుట్ సైడ్ ఏజెన్సీల నిర్వాహకులతో చర్చించారు. భాస్కర అతిథి భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం సాయంత్రం 6.30 నుంచి సుమారు 2 గంటలకుపైగా షార్లోని వివిధ ప్రాజెక్టులపై స్థానిక సంచాలకులు డిప్యూటీ డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. ఆగ్మెంటేషన్ ఆఫ్ సాలిడ్ మోటార్ల ప్రొడక్షన్ ఫెసిలిటీస్, పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, ఎల్ఎల్పీ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు ఫర్ సెమీ క్రయో స్టేజ్, ఎస్ఎస్పీ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టులో చేపట్టే చంద్రయాన్-3, గగనయాన్ ప్రాజెక్టులపైనా చర్చించినట్లు సమాచారం. షార్ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్, అసోసియేట్ డైరెక్టర్ బద్రి నారాయణమూర్తి, వీఏఎల్ఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామన్, ఎంఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ సెంథిలుమార్, ఎంఎస్ఓ జీడీ గోపీకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles