28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే!

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటా కల్పించేందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉప వర్గీకరణకు అనుమతి ఉందని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.

ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 6-1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. అయితే మెజారిటీ అభిప్రాయంతో జస్టిస్ బేల ఎం. త్రివేది విభేదించారు. ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.

ఈ కేసులో ఆరు వేర్వేరు అభిప్రాయాలు వచ్చాయి

  • తీర్పులోని సారాంశాలను చదివిన CJI, షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి కాదని చారిత్రక, అనుభావిక ఆధారాలు సూచించాయని అన్నారు.
  • ఎస్సీలలో ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించదని ఆయన అన్నారు.
  • వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం రాష్ట్ర విధి అని, ఎస్సీ/ఎస్టీ కేటగిరీలో కొద్దిమంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని జస్టిస్ బిఆర్ గవాయి అన్నారు.
  • క్రీమీలేయర్లకు చెందిన ఎస్సీల పిల్లలను గ్రామంలోని మాన్యువల్ స్కావెంజర్ పిల్లలతో సమానంగా ప్రవర్తించడం అన్యాయమని ఆయన అన్నారు.
  • జస్టిస్ విక్రమ్ నాథ్, ఓబీసీలకు వర్తించే క్రీమీలేయర్ సూత్రాన్ని ఎస్సీ/ఎస్టీలకు కూడా వర్తింపజేయాల్సిన అవసరాన్ని తన తీర్పులో నొక్కి చెప్పారు.

కేసు నేపథ్యం
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.

దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్చును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles