23.7 C
Hyderabad
Monday, September 30, 2024

హైదరాబాద్‌లో అతిపెద్ద డాటా సెంటర్‌ ఏర్పాటు… ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడి!

హైదరాబాద్‌ : గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌  సంస్థకిది నాల్గో డాటా సెంటర్.‌ కాగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టనున్నట్టు ఆ సంస్థ‌ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్‌ అవగాహన ఒప్పందం చేసుకున్నది. వచ్చే 15 ఏండ్లకుపైగా కాలంలో ఈ పెట్టుబడులు రానుండగా, 2025 నాటికి డాటా సెంటర్‌ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. కాగా, చందన్‌వెల్లి, ఎల్లికట్ట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో డాటా సెంటర్‌ విస్తరించి ఉంటుంది. సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో మైక్రోసాఫ్ట్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జీన్‌-ఫిలిప్‌ కోర్టోయిస్‌, మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ మహేశ్వరి తదితరులు డాటా సెంటర్‌ రీజియన్‌ ఏర్పాటు వివరాలను ప్రకటించారు.

దేశంలో విస్తృతమైన డాటా సెంటర్ల నెట్‌వర్క్‌తోపాటు సుదూర డీఆర్‌ సదుపాయం కలిగివుండటం, భూకంప మండలాల పరిధికి దూరంగా ఉండటం, ఈ డాటా సెంటర్‌ రీజియన్‌ ప్రత్యేకత. మరోవైపు తమ పౌరసేవా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు తెలంగాణ, మైక్రోసాఫ్ట్‌లు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మొబిలిటీ తదితర కీలక రంగాల్లో సాంకేతికతను వృద్ధిచేసేందుకు దోహదపడనుంది. ఇదిలావుంటే దేశీయంగా ఇప్పటికే పుణె, ముంబై, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్‌కు డాటా సెంటర్లున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటిలోకెల్లా హైదరాబాద్‌దే అతిపెద్దది కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ స్థానిక వ్యాపారాభివృద్ధికి ఈ డాటా సెంటర్‌ పరోక్షంగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌, డాటా-నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌ వంటి ఎన్నో విభాగాల్లో ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles