31 C
Hyderabad
Tuesday, October 1, 2024

వారణాసిలోని ఓ కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఈవీఎంలు మాయం… అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపణ!

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అధికార బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మంగళవారం ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఓ కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఈవీఎంలను దొంగతనంగా తరలించినట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక వేదికల్లో  వైరల్‌గా మారింది. దీనిపై వారణాసి జిల్లా కలెక్టర్‌ కౌశల్‌ రాజ్‌ శర్మ స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న ఈవీఎంలను ఓటింగ్‌ కోసం వాడలేదని స్పష్టం చేశారు. వీడియోలో ఉన్నవి కేవలం శిక్షణ కోసం వాడిన డమ్మీ ఈవీఎంలని పేర్కొన్నారు. అనవసరంగా కొన్ని రాజకీయ పార్టీలు పుకార్లను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
లెక్టర్‌ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన అఖిలేశ్‌ మళ్లీ మీడియాతో మాట్లాడారు. ‘వారణాసిలో ఈవీఎంలు ఉన్న మూడు లారీలు మాకు కనిపించాయి. అందులో ఒకదాన్ని మేము పట్టుకొన్నాం. మిగతా రెండు లారీలు మా నుంచి తప్పించుకొన్నాయి. అనుమానాస్పదరీతిలో ఎలాంటి ఉల్లంఘనలు జరుగకపోతే, ఆ లారీలు ఎందుకు తప్పించుకు పారిపోయాయి?’ అని అఖిలేశ్‌ ప్రశ్నించారు. అభ్యర్థుల అనుమతి లేకుండా ఈవీఎంలను వేరేచోట్లకు తరలించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈవీఎంలను పట్టుకోగానే, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ ఓడిపోయే స్థానాల్లో కౌంటింగ్‌ నెమ్మదిగా జరిగేలా చూడాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పీఎస్‌) నుంచి ఆదేశాలు వెళ్లినట్టు మాకు సమాచారం ఉన్నది’ అని పేర్కొన్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో బీజేపీ కేవలం 5,000 ఓట్ల మార్జిన్‌తో గెలిచినట్టు గుర్తుచేశారు.
మార్చి 7 పోలింగ్‌ తర్వాత రెండు లారీల్లో కొన్ని ఈవీఎంలు కనిపించకుండా పోయాయని ఆరోపిస్తూ ఎస్పీ, దాని మిత్రపక్షాలు సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, జన్‌వాదీ పార్టీ (సోషలిస్ట్‌) నేతలు మంగళవారం లక్నోలోని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)కు మెమోరండం సమర్పించారు. ఫిర్యాదును స్వీకరించామని, దర్యాప్తు జరిపి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకొంటామని యూపీ అదనపు సీఈవో బీడీఆర్‌ తివారీ తెలిపారు.
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయంటూ సర్వేలు పేర్కొనడంపై అఖిలేశ్‌ స్పందించారు. ఈవీఎంల దొంగతనాన్ని పక్కదారిపట్టించేందుకే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ అని విమర్శించారు. యూపీలో తమ కూటమే అధికారంలోకి వస్తుందని, 300కుపైగా సీట్లను గెలుస్తామని తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles