30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కల్తీ మద్యం కలకలం.. బీహార్​లో 37మంది మృతి..!

పాట్నా: బీహార్​లో కల్తీ మద్యం మరోసారి కలకలం సృష్టించింది. మద్యనిషేదం ​ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ మద్యం విక్రయాలు ఆగటం లేదు. ఆ మద్యం సేవించి అమాయకులు బలవుతున్నారు.  హోలీ రోజు నుండి బీహార్‌లోని మూడు జిల్లాల్లో (భాగల్​పుర్​, బాంకా, మధేపురా జిల్లాల్లో) కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 37 మంది మరణించారు. భాగల్‌పూర్ జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయి, శనివారం ఉదయం నుండి ఇప్పటివరకు 22 మంది మరణించారు. బంకా జిల్లాలో 12 మంది, మాధేపురాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇవి అనుమానస్పద మరణాలు అని బీహార్ పోలీసులు పేర్కొంటున్నారు.  అసలు కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని చెబుతున్నారు. అయితే కల్తీ మద్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు.

హోలీ సందర్భంగా శుక్రవారం సాయంత్రం, శనివారం తెల్లవారుజామున మద్యం సేవించారని, అప్పటి నుంచి వారి ఆరోగ్య పరిస్థితి విషమించిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని వారు వాపోయారు. బాధితులను భాగల్‌పూర్, బంకా, మాధేపురాలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. భాగల్‌పూర్‌లోని సాహెబ్‌గంజ్‌కు చెందిన కుమార్ గౌరవ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో మద్యం విక్రయాలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారని, అయితే పోలీసులు చర్యలు తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు.

ఎల్​జేపీ లీడర్​ సహా ముగ్గురు.. మెధేపురా జిల్లా, ముర్లిగంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని డిగ్గి గ్రామంలో కల్తీ మద్యం తాగి లోక్​ జనశక్తి పార్టీ బ్లాక్​ అధ్యక్షుడు సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, స్థానిక యంత్రాంగం ఎలాంటి ప్రకటన చేయలేదు. గత గురువారం గ్రామంలో మందు పార్టీ జరిగింది. ఆ మరుసటి రోజున పార్టీలో పాల్గొన్నవారు అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు మృతి చెందారు. మృతులు.. పురాకి సింగ్​(32), ఎల్​జేపీ బ్లాక్​ అధ్యక్షుడు నీరజ్​ నిశాంత్​ సింగ్​ బావూ, సంజీవ్​ కుమార్​ రమణి(25)గా గుర్తించారు.

బీహార్ లో క‌ల్తీ మ‌ద్యం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కల్తీ మద్యం సేవించ‌డం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. బీహార్‌లో సంపూర్ణ నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజూ కల్తీ మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు నియంత్రణ జరగ‌లేదు. కల్తీ మద్యం సేవించడం కారణంగా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

3 లక్షలకుపైగా కేసులు​.. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని 2016లో అమలు చేసింది బిహార్​ ప్రభుత్వం. మద్యం తయారీ, విక్రయం, సేవించటం నేరం. తొలినాళ్లలో నేరానికి పాల్పడితే ఆస్తుల స్వాధీనం, జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేశారు. అయితే, 2018లో లిక్కర్​ బ్యాన్​ చట్టానికి సవరణలు చేశారు. శిక్షల్లో ఉపశమనం కల్పించారు. 2016 నుంచి ఇప్పటి వరకు 3లక్షలకుపైగా నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles