24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాజద్రోహ చట్టం అమలు నిలిపివేత… సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం!

సెక్షన్ 124ఎ కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు
దర్యాప్తులు, కఠిన చర్యలు తీసుకోవడంపైనా యథాతథ స్థితి
ఇప్పటికే దాఖలైన ఎఫ్ఎఆర్ పై చర్యలొద్దు
 సీజేఐ జస్టిస్ ఎన్. వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం చరిత్రాత్మక నిర్ణయం
అరెస్టై జైళ్లలో ఉన్న వాళ్లు న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందవచ్చని వెల్లడి
సుప్రీం ఉత్తర్వులు.. స్వాగతించిన విపక్షాలు
మోదీ పాలనలో 399 మందిపై రాజద్రోహం కేసులు

న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం నిన్న సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పదంగా మారిన రాజద్రోహం లేదా దేశద్రోహం చట్టాన్ని (Sedition Law) సుప్రీంకోర్టు నిలిపేసింది. రాజద్రోహం కేసుగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 124ఏ ఇకపై చెల్లుబాటు కాబోదని, ఈ సెక్షన్ కింద కొత్తగా కేసులు నమోదు చేయడానికి వీల్లేదని సీజేఐ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఎ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ కీలకమైన ఆదేశాలిచ్చింది.

ఒకవేళ ఎవరిపైనైనా ఈ సెక్షన్‌తో పాటు, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉంటే మిగిలిన సెక్షన్ల కింద విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. రాజద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జులై మూడో వారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని అన్ని విపక్ష పార్టీలు, ఎడిటర్స్ గిల్డ్ స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు తమ పరిధులను అతిక్రమించరాదంటూ ‘లక్ష్మణ రేఖ’ను ప్రస్తావించింది.

కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 124ఎ నిబంధనపై పునఃసమీక్షకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

బ్రిటిష్ వలస పాలకులు 1890లో రూపొందించిన రాజద్రోహం చట్టాన్ని స్వాతంత్య్రం సాధించిన తర్వాత కూడా కొనసాగించడంలోని ఔచిత్యాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ చట్ట నిబంధనలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో దీని అమలుపై సుప్రీంకోర్టు బుధవారం నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు దారి తీసిన నేపథ్యం సంక్షిప్తంగా…

2022, ఏప్రిల్ 27: ఐపీసీ సెక్షన్ 124ఎ రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు.

2022, మే 5: పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసే విషయమై మే 5వ తేదీ నుంచి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడి.

మే 7: రాజద్రోహ చట్టం చెల్లబాటును సమర్థిస్తూ 1962లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకించిన కేంద్ర ప్రభుత్వం.

మే 9: రాజద్రోహం నిబంధనను పునఃసమీక్షిస్తామంటూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన కేంద్రం.

మే 10: పునఃసమీక్ష ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అంగీకారం.

మే 11: పునఃసమీక్ష పూర్తయ్యే వరకు రాజద్రోహం చట్టం నిలుపుదలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం.

తీర్పుపై ఎవరు ఏమన్నారంటే…

ప్రజాస్వామ్య విజయం : మహువా మొయిత్రా, టీఎంసీ
ఇది ప్రజాస్వామ్య విజయమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గొప్ప రోజని పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు అభినందనలని తెలిపారు.

నిజం చెప్పడం దేశభక్తి… : రాహుల్‌ గాంధీ
నిజం చెప్పడం దేశభక్తి అనీ, రాజద్రోహం కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. రాజద్రోహం చట్ట అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన స్పందించారు. సత్యాన్ని వినడం కర్తవ్యమనీ, సత్యాన్ని అణిచివేయడం అహంకారమని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టుకు సెల్యూట్‌ : ప్రశాంత్‌ భూషణ్
రాజద్రోహ చట్టాన్ని ప్రబలంగా దుర్వినియోగం చేయకుండా నిరోధించే ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు సెల్యూట్‌ అని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ పేర్కొన్నారు.

చారిత్రాత్మక తీర్పు : సీపీఐ
రాజద్రోహ చట్టంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సీపీఐ స్వాగతించింది. చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా 2011లోనే రాజ్యసభలో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేసింది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక నియంతృత్వ చట్టమని పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles