31 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రయాగ్‌రాజ్‌లో బుల్డోజర్లు… నిరసనకారుల ఇళ్ల కూల్చివేత!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి అదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ముస్లింలకు వ్యతిరేకంగా దాడులు సాగిస్తున్నది. ముస్లింను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేయడంతో బాటు, నిరసనలపై తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. అక్రమ నిర్మాణాలనో, హింసతో ప్రమేయముందనో చెప్పి షహరాన్‌పూర్‌, కాన్పూర్‌, ప్రయోగ రాజ్‌లలో ముస్లిం ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నది.

దీనిలో భాగంగానే ప్రయాగ్‌రాజ్‌లో ప్రముఖ రాజకీయ వేత్త జావెద్‌ మహ్మద్‌ ఇంటిని ఆదివారం మధాహ్నం యూపీ పోలీసులు దౌర్జన్యంగా కూల్చివేశారు. మరోవైపు మహమ్మద్‌ ప్రవక్తపై బిజెపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆదివారం కూడా నిరసనలు హోరెత్తాయి. యూపీ అంతటా నిరసనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నాటి హింసతో సంబంధం ఉందంటూ 400 మందికిపైగా నిరసనకారులను యుపి పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల కేసులో జావెద్‌ను కీలక సూత్రధారిగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధి సంస్థ (పిడిఎ) ఈ కూల్చివేతను సమర్థించుకుంది.

2011లో ప్రారంభమైన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా ఉన్న 54 ఏళ్ల జావేద్‌ను జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండ వెనుక కుట్రదారులలో ఇతను ఒకడని పేర్కొన్నారు. ఇతర నిందితులను విచారిస్తున్నప్పుడు అతని పాత్ర వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు వాట్సాప్ సందేశాల ద్వారా నిరసనల ప్రదేశానికి చేరుకోమని ప్రజలను కోరుతూ అతను “బంద్” కు పిలుపునిచ్చాడని ఆరోపించారు.

కాగా, తమ తండ్రిని వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ చేశారని, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, ఇప్పుడు ఇంటిని కూడా కూల్చేశారని జావేద్‌ కూతురు అఫ్రీన్‌ ఫాతిమా ప్రభుత్వ తీరుపై మండిపడుతోంది.

తన కుమార్తె (అఫ్రీన్ ఫాతిమా) తరచూ తనకు సలహాలు ఇస్తుందని జావేద్ విచారణలో చెప్పాడని ఎస్‌ఎస్‌పి అజయ్ కుమార్ శనివారం తెలిపారు. అయితే, ప్రాథమిక విచారణలో, పోలీసులకు ఇప్పటివరకు ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆమెను ప్రశ్నిస్తారా అని ప్రశ్నించగా, బలమైన ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జావేద్ కుమార్తె అఫ్రీన్ ఫాతిమా, తన కళాశాల రోజుల్లో విద్యార్థి నాయకురాలు, 2021లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ పూర్తి చేసింది. వెల్ఫేర్ పార్టీ విద్యార్థి విభాగం అయిన ఫ్రటెర్నిటీ మూవ్‌మెంట్ జాతీయ కార్యదర్శి.

ఆదివారం, జావేద్ నివాసంలో పగటిపూట జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో కంట్రీ మేడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. “సెర్చ్ ఆపరేషన్ సమయంలో, మేము ఇంటి నుండి రెండు దేశీయ పిస్టల్స్, అభ్యంతరకరమైన పోస్టర్లు మరియు అనేక కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నాము. కోర్టులో జావేద్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పత్రాలు కూడా మాకు దొరికాయి. అన్ని కథనాలను పరిశీలిస్తున్నామని, కేసు దర్యాప్తులో భాగం చేస్తామని సీనియర్ ఎస్పీ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles