25.2 C
Hyderabad
Monday, September 30, 2024

అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గం… లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి!

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సైనిక నియామక పథకం ‘అగ్ని పథ్‌’పై దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు కొనసాగున్నప్పటికీ.. ఈ పథకం అమలుపై వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ స్పష్టం చేసింది. ఇక నుంచి త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ పాతపద్ధతిలో ఉండదని, ‘అగ్నిపథ్‌’ కిందే సైనిక నియామకాలు ఉంటాయని తేల్చిచెప్పింది.

ఈ మేరకు మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరి ఆదివారం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్నవారికి నియామకాల్లో చోటు ఉండదని స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ పథకంలో చేరాలనుకునేవారు తాము ఎలాంటి నిరసనల్లో పాల్గొనలేదని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, పోలీస్‌ వెరిఫికేషన్‌ కూడా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో లెఫ్టినెంట్ జనరల్ పూరీ, ఎయిర్ మార్షల్ ఎస్‌కే.ఝా, వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఎల్‌జి.సి బన్సీ పొన్నప్ప పాల్గొన్నారు.

ఇక, అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరేవారికి ఎలాంటి అలవెన్సులు, ఇతరత్రా భత్యాలు ఉండవనే ప్రచారం సరికాదని పూరి పేర్కొన్నారు. అగ్నివీరులకు ఇతర సైనికుల మాదిరిగానే జీత భత్యాలు లభిస్తాయని తెలిపారు. సర్వీసులో ఉండగా అమరులైతే.. రూ.కోటి పరిహారంగా సైనికుడి కుటుంబానికి అందిస్తామన్నారు.

“ప్రతి సంవత్సరం మిలిటరీ, వాయుసేన, నావికాదళం… ఈ మూడు సర్వీసుల నుండి దాదాపు 17,600 మంది ముందస్తు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. పదవీ విరమణ తర్వాత వారు ఏమి చేస్తారని ఎవరూ వారిని అడగడానికి ప్రయత్నించలేదు” అని పూరి అన్నారు. ప్రస్తుతం సియాచిన్ మరియు ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న సాధారణ సైనికులకు వర్తించే జీతభత్యాలే అగ్నివీర్లకు  లభిస్తుందని ఆయన తెలిపారు.

“అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 24 నుండి ప్రారంభమవుతుంది మరియు జూలై 24 నుండి, దశ 1 ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ ప్రారంభమవుతుంది” అని ఎయిర్ మార్షల్ ఝా చెప్పారు. డిసెంబరులోగా మొదటి బ్యాచ్‌ని నమోదు చేసుకుంటామని, డిసెంబరు 30 నాటికి శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు.

ఇండిన్ నేవీలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ గురించి వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి మాట్లాడుతూ, నవంబరు 21 నుంచి ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కా శిక్షణా కేంద్రానికి నావికా దళ అగ్నివీర్‌ల మొదటి బ్యాచ్ చేరుకోవడం ప్రారంభిస్తుందని తెలిపారు. అగ్నిపథ్ పథకం ద్వారా స్త్రీ, పురుషులు ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. .

“ఇండియన్ నేవీలో ప్రస్తుతం 30 మంది మహిళా అధికారులు వివిధ భారత నౌకాదళ నౌకల్లో ప్రయాణిస్తున్నారు. అగ్నిపథ్ పథకం కింద మహిళలను కూడా రిక్రూట్ చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. వారిని యుద్ధనౌకలలో మోహరిస్తారు” అని నేవీ అధికారి తెలిపారు.

“డిసెంబర్ నాటికి, మేము మొదటి బ్యాచ్ 25,000 అగ్నివీర్‌లు సిద్ధమవుతారు. రెండవ బ్యాచ్ ఫిబ్రవరి 2023 నాటికి తయారవుతుంది, అప్పుడు ఈ సంఖ్య 40 వేలు అవుతుంది” అని లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొనప్ప చెప్పారు.

మొత్తంగా అగ్నిపథ్‌ పథకంపై ఇంతగా నిరసనలు పెల్లుబుకుతున్నా… రక్షణ మంత్రి ఎలాంటి వివరణ ఇవ్వకపోగా… రక్షణ దళాల ఉన్నతాధికారులు ముందుకు వచ్చి అగ్నిపథ్‌ను ఎందుకు సమర్థిస్తున్నారు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీనిపై రక్షణ మంత్రి ఒక బహిరంగ ప్రకటన విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles