33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘మహా’ సంక్షోభం… రేపు బలపరీక్షకు గవర్నర్ ఆదేశం… సుప్రీంకు వెళ్లనున్న శివసేన!

ముంబై: మహా సంక్షోభం నేడు కీలక మలుపు తిరిగింది. ఎత్తులకు పైఎత్తులు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. మహారాష్ట్ర రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాకిస్తూ గురువారం  బల పరీక్షకు సిద్ధం కావాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. ఇందుకోసం అసెంబ్లీని ప్రత్యేకంగా హాజరుపరచాలని.. సాయంత్రం 5 గంటల్లోగా బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్‌కు లేఖ రాశారు. దీంతో శిందే వర్గం ఎమ్మెల్యేలు గురువారం గువాహటి నుంచి ముంబయి చేరుకోనున్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను బలపరీక్షకు ఆదేశించాలని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్​ను కోరిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం జరగడం గమనార్హం.

‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలవరపెడుతోంది. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అగాధి ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును  ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నన్ను కలుసుకున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, ఫ్లోర్ టెస్ట్ కోసం అడిగారు’’ అంటూ బలపరీక్ష ఆదేశాల్లో గవర్నర్ కోశ్యారీ వివరించారు. “స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు, స్వతంత్ర ఏజెన్సీ ద్వారా విధానసభ  సమావేశం రికార్డు చేస్తామని గవర్నర్ చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం సభ్యులను తమ స్థానాల్లో లేవమని చెప్పడం ద్వారా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించబడుతుంది…” అని గవర్నర్ కోష్యారి చెప్పారు.

కాగా రేపు అసెంబ్లీలో  మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశిండాన్ని సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ ఉదయం చెప్పారు.  గవర్నర్ నిర్ణయం అసమ్మతి వర్గానికి మేలు చేసేలా ఉందని, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

“16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని సుప్రీంకోర్టు జూలై 11వ తేదీకి వాయిదా వేసినప్పుడు ఫ్లోర్ టెస్ట్‌ను ఎలా నిర్వహిస్తారు? ఈ ఎమ్మెల్యేల అనర్హత స్థితిని నిర్ణయించనంత వరకు, నోటీసులోని విషయాలకు సమాధానం ఇవ్వకుండా ఫ్లోర్ టెస్ట్‌లో ఎలా పాల్గొంటారు. న్యాయమా?” సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. “ఈ విషయం సుప్రీం కోర్ట్‌లో ఉంది. తుది విచారణ పూర్తి కాకుండానే ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తే ఇది కోర్టు ధిక్కారం అవుతుంది” అని ఆమె అన్నారు.

ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఠాక్రే బృందం డిప్యూటీ స్పీకర్‌ను కోరింది, ఆ తర్వాత తిరుగుబాటు నేతలు ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న నోటీసులపై స్పందించేందుకు న్యాయస్థానం జూలై 12 వరకు గడువు ఇచ్చింది. అయితే తిరుగుబాటుదారులు స్పందించాల్సిందిగా కోరిన తేదీ కంటే ముందే మెజారిటీ నిరూపించుకోవాలని థాకరేను గవర్నర్ కోరారు.

తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని షిండే పేర్కొన్నారు. 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం మెజారిటీ 144గా ఉంది. శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార కూటమికి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.

సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు)

  • మెజారిటీ మార్కు:                 144 
  • పాలక కూటమి వాస్తవ బలం:      168
  • షిండే తిరుగుబాటు తర్వాత:        119
  • షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు:      49
  • బీజేపీ కూటమి వాస్తవ బలం:       113
  • షిండే కూటమి మద్దతిస్తే:            162

ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే తన బలాన్ని నిరూపించుకుంటారా?.. లేక తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే తన పంతం నెగ్గించుకుంటారా?.. అన్నది ఆసక్తిగా మారింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles