28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ఎల్లోరా’ గుహల్లో హైడ్రాలిక్ లిఫ్ట్‌… ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా!

ఔరంగాబాద్:  మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. కొండలను తొలిచి అద్భుతమైన రాతి నిర్మాణాలుగా మలిచారు. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్ధం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకుట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి. భారతీయ కళలు, నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు, శిల్పాలు చాటిచెబుతాయి.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు దేశంలోనే హైడ్రాలిక్ లిఫ్ట్‌ను కలిగి ఉన్న తొలి స్మారక చిహ్నంగా అవతరించనుందని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) సీనియర్ అధికారి నేడు తెలిపారు. ఔరంగాబాద్ నగరం నుండి 30 కి.మీ దూరంలో ఉన్న ఎల్లోరా ప్రపంచంలోనే అతిపెద్ద రాతితో కట్టబడిన ఆలయ సముదాయాలలో ఒకటి, ఇందులో హిందూ, బౌద్ధ, జైన శిల్పాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అత్యధిక పర్యాటకులు సందర్శిస్తారు.

“500 మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎల్లోరా గుహలను పర్యాటకులకు అనుకూలంగా మార్చేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనేక ప్రాజెక్టులను చేపడుతున్నది. ఇవి ప్రస్తుతం అమలులో ఉన్నాయి” అని ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలన్ కుమార్ చౌలీ పీటీఐ వార్తా సంస్థకి చెప్పారు.

కాంప్లెక్స్‌లోని 34 గుహలలో, కైలాష్ గుహగా ప్రసిద్ధి చెందిన గుహ నంబర్ 16, రెండంతస్తుల నిర్మాణం అని, పర్యాటకులు పై నుండి వీక్షించడానికి మెట్ల ద్వారా లేకుంటే లేదా ర్యాంప్‌పైనుండి చేరుకోవచ్చు. వీల్‌చైర్ల ద్వారా సాఫీగా గుహపైకి వెళ్లేందుకు ర్యాంప్‌ను నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ నిర్మాణానికి రెండు వైపులా చిన్న లిఫ్టులను ఏర్పాటు చేయాలని భారత పురావస్తు శాఖ ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.

“ఈ లిఫ్టుల ఏర్పాటుకు కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ లిఫ్టు 9 చదరపు అడుగుల విస్తీర్ణంతో చిన్నదిగా ఉంటుంది, దీనిలో వీల్ చైర్‌లో ఉన్న వ్యక్తి సులభంగా మొదటి అంతస్తుకు వెళ్లవచ్చు, ”అని పురావస్తు శాఖ అధికారి తెలిపారు.

తద్వారా ఎల్లోరా గుహలు లిఫ్ట్ సౌకర్యం కలిగిన మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారనున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని చౌలే చెప్పారు. దీంతో పర్యాటకులు కొండలతో కూడిన ఒకే ఏకశిలా కట్టడమైన కైలాస గుహను కూడా పై నుండి చూడగలుగుతారని, ఎగువ కొండపై దానికి ఒక మార్గాన్నికూడా నిర్మిస్తామని ఆయన చెప్పారు.

భారత పురావస్తు శాఖ ఎల్లోరా గుహలకు అక్కడక్కడా కొన్ని మెరుగులు దిద్దుతోంది. పెయింటింగ్‌లకు లైట్లను అమర్చాలని, మరికొన్ని భాగాల పరిరక్షణ పనులను చేపట్టాలని యోచిస్తోంది. ఈ గుహలను ప్రతిరోజు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా 2,000 నుండి 3,000 మంది సందర్శకులను వస్తూంటారు. దీంతో “మేము ఎల్లోరాలో టిక్కెట్ కౌంటర్ల సంఖ్యను పెంచాలని, గైడ్‌లు కావాలనుకునే పర్యాటకులకోసం మరో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కాంప్లెక్స్‌కు ఒకే ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ ఉంటుంది. అలాగే సెల్ఫీలు దిగేందుకు కొన్ని ల్యాండ్‌స్కేపింగ్ పాయింట్లను అభివృద్ధి చేయనున్నామని పురావస్తు అధికారి చౌలే చెప్పారు.

శానిటరీ ప్యాడ్ డిస్పోజల్ మెషిన్‌లతో కూడిన నాలుగు టాయిలెట్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలని కూడా భారత పురావస్తు శాఖ యోచిస్తోంది, గుహ ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆగస్టు నెలలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

మొత్తంగా ఈ ప్రాజెక్టుల పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టవచ్చని పురావస్తు శాఖాధికారి చౌలే చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles