24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఈడీ అదుపులో సంజయ్‌ రౌత్‌… ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే అన్న ఎంపీలు!

ముంబై: మహారాష్ట్ర తాజా మాజీ సీఎం, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అదుపులోకి తీసుకుంది. రూ.1,034 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి గత నెల(జూలై) 1న సంజయ్‌ రౌత్‌ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కూడా ఆయన్ను విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. చివరి సారి గత నెల 27న సమన్లు పంపగా.. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రాలేనని సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. దాంతో.. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ భాండు్‌పలోని సంజయ్‌ రౌత్‌ ఇంటి(మైత్రి)కి చేరుకున్నారు.

ఉదయం నుంచి పత్రాచాల్‌ రీ-డెవల్‌పమెంట్‌కు సంబంధించిన రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణంపై ఆయనపై ప్రశ్నలు సంధించారు. రౌత్‌ ఇంట్లోంచి రూ. 11.50 లక్షలను సీజ్‌ చేసినట్లు ఈడీ వివరించింది. ఆ మొత్తం గురించి సంజయ్‌రౌత్‌ను ప్రశ్నించగా.. రూ. 10 లక్షలు పార్టీకి సంబంధించినవని.. రూ. 1.50 లక్షలు తన ఇంటి మరమ్మతులకు ఉద్దేశించినవని ఆయన వివరించారని ఈడీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం వరకు పలు కోణాల్లో విచారణ కొనసాగింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంపీ ఇంటి నుంచి రూ. 11.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నప్పటికీ, పత్రా చాల్‌కు సంబంధించిన ఎలాంటి పత్రాన్ని ED కస్టడీలోకి తీసుకోలేదని సంజయ్ రౌత్ న్యాయవాది విక్రాంత్ సబ్నే పేర్కొన్నారు.

ఈ కేసులో ఈడీ ఏప్రిల్‌ నెలలో సంజయ్‌ సతీమణి వర్ష రౌత్‌, ఆయన ఇద్దరు సన్నిహితులు సుజిత్‌ పట్కర్‌, ప్రవీణ్‌ రౌత్‌లకు సంబంధించిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే.  సుజిత్‌ పట్కర్‌, ఆయన భార్య స్వప్న పట్కర్‌, ప్రవీణ్‌ రౌత్‌తో సం జయ్‌ రౌత్‌కు ఉన్న సాన్నిహిత్యం, ఇతర వ్యాపార సంబంధాల గురించే ఈడీ సంజయ్‌ రౌత్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది.

ప్రాణాలు పోయినా తలొగ్గను
ఈడీ కార్యాలయం వద్ద రౌత్‌ మీడియాతో మాట్లాడారు. ‘వారు(ఈడీ) నన్ను అరెస్టు చేయబోతున్నది. నేను అరెస్టు కాబోతున్నాను’ అని పేర్కొన్నారు. ప్రాణాలు పోయినా తలొగ్గేది లేదని, శివసేనను వీడేది లేదని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు.

రాజకీయ ప్రతీకారంతో మోదీ సర్కార్‌ను తనను టార్గెట్‌గా చేసుకున్నదని ఉదయం సోదాలు ప్రారంభమైన తర్వాత ట్విట్టర్‌లో స్పందించారు. తప్పుడు ఆధారాలతో తప్పుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ‘బాలాసాహెబ్‌ ఠాక్రేపై ప్రమాణం చేసి చెబుతున్నా..ఎలాంటి కుంభకోణంతో నాకు సంబంధం లేదు’ అని ట్వీట్‌ చేశారు. కాగా, ఈ కేసులో జూలై 1న ఈడీ అధికారులు రౌత్‌ను దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించారు. తర్వాత మరోసారి విచారణకు రావాలని రెండుసార్లు సమన్లు ఇచ్చారు. అయితే ఈడీ విచారణకు రౌత్‌ హాజరుకాలేదు.

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే..
దేశంలో ఎంతోమందికి ఐటీ, ఈడీ, సీబీఐ నోటీసులు వస్తు న్నా.. సంజయ్‌ రౌత్‌నే పదేపదే ఎందుకు విచారించాలని ఈడీ అనుకుంటున్నదని ప్రతిపక్ష ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కాంగ్రెస్‌ నేత సచిన్‌ సావంత్‌ విమర్శించారు. సంజయ్‌ రౌత్‌పై ఈడీ చర్యలు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు సాక్ష్యమని టీఎంసీ ఎంపీ శాంతను సేన్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ లోపలా, బయటా విపక్షాల గొంతుక లేకుండా చేయాలని చూస్తున్నదని దుయ్యబట్టారు.

తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ.. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను నాశనం చేసేందుకు తన ప్రయత్నాలను ఆపలేదు. పాత మిత్రుడు బాల్‌ ఠాక్రే స్థాపించిన శివసేనను నామరూపాల్లేకుండా చేసేందుకు శివసేన సీనియర్ నేత, రాజ్యసభ  ఎంపీ సంజయ్‌ రౌత్‌పై కక్ష కట్టిందని రాజకీయ విశ్లేషకు పేర్కొంటున్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles