28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బిల్కిస్‌ బానో కేసు… దోషుల విడుదలపై మండిపడ్డ విపక్షాలు!

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బానోకేసులో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేనంటూ విమర్శలు గుప్పించాయి.  స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్ర‌ధాని మోడీ “నారీ శక్తి”ని ప్రశంసించిన కొన్ని గంటల్లోనే ఈ దోషులను విడుదల చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.

2002 గోద్రా ఘటన తర్వాత బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు పలువురు ఘనస్వాగతాలు పలుకడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

మహిళల భద్రత, గౌరవం, సాధికారత గురించి మాట్లాడిన ప్రధాని మోదీ తన మాటలను స్వయంగా విశ్వసిస్తారో లేదో దేశానికి చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ‘నిన్న ఎర్రకోట ప్రాకారాల మీద నుంచి ప్రధానమంత్రి మహిళల భద్రత, మహిళా శక్తి, మహిళల గౌరవం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కొన్ని గంటల తర్వాత గుజరాత్ ప్రభుత్వం అత్యాచార దోషుల‌ను విడిచిపెట్టింది. విడుదలైన వారికి సన్మానం జరుగుతోంది. ఇదేనా అమృత్ మహోత్సవ్‌ అని ఖేరా అన్నారు.

కథువా, ఉన్నావ్ కేసులను కూడా ఆయన ప్రస్తావించారు. ఒక జాతీయ రాజకీయ పార్టీకి చెందిన ఆఫీస్ బేరర్లు, మద్దతుదారులు వీధుల్లో రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ చేయడం చూసినప్పుడు ఇది రాజకీయాల్లో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుందని అన్నారు.

సీపీఐ(ఎం) కూడా దోషుల విడుదలను ఖండించింది. నవ భారతదేశ అసలు ముఖం ఇది. దోషులుగా నిర్ధారించబడిన హంతకులను, రేపిస్టులను విడుదల చేసారు, న్యాయం కోసం పోరాడిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు జైలు శిక్ష విధించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మాట్లాడుతూ.. బిల్కిస్ బానో 2002 గుజరాత్ హింసాత్మక ఘటనలో అత్యాచారానికి గురయ్యారని, కానీ, ఇప్పుడూ ఆమె కుటుంబాన్ని మొత్తం హత్య చేసి సామూహిక సమాధిలో పాతిపెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం  దారుణమైన నేరానికి పాల్పడిన మొత్తం 11 మంది రాక్షసులను విడుదల చేసింది. ప్రజలు & నోయిడా మీడియా ఆగ్రహం ఎక్కడ ఉంది? అని ఆయన ట్వీట్ చేశారు.

సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడుతూ.. అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య వంటి నేరాలకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష నుంచి ఉపశమనం కలిగించే ప్రయోజనాలను మినహాయించి దోషులను విడుదల చేయడం కేంద్రం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని అన్నారు.

ఈ ఏడాది జూన్‌లో, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (75 సంవత్సరాల స్వాతంత్ర్యం) గుర్తుగా శిక్ష పడిన ఖైదీల కోసం ప్రత్యేక విడుదల విధానాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ కింద విడుదల చేయకూడని వారిలో రేప్ దోషులు కూడా ఉన్నారు. గుజరాత్ ప్రభుత్వ విడుదల ఉత్తర్వు దిగ్భ్రాంతికరం, సిగ్గుచేటు, ఖండించదగినది అని ఆమె అన్నారు.

రాజస్థాన్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో ‘అగ్రవర్ణం’ కుండలోని నీళ్లు తాగించినందుకు దళిత పిల్లవాడిని హత్య చేయడం, బిల్కిస్ బానో కేసులో గుజరాత్‌లో పదకొండు మంది అత్యాచారం, హత్యాచార ఖైదీలను విడుదల చేయడం వంటివి మన దేశం నిజంగా కుళ్ళిపోయిందని చెబుతున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత భారత రాష్ట్రం!’’ అని సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles