31 C
Hyderabad
Tuesday, October 1, 2024

జ్ఞానవాపి మసీదు కేసు: ముస్లిం పక్షం పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు!

లక్నో: యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

హిందూ పక్షాల తరఫున లాయర్ విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ముస్లిం పక్షం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. దేవతా విగ్రహాల నిత్య పూజలకు అనుమతించాలన్న దావా విచారణకు అర్హమైనదేనని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే విశ్వేశ్ పేర్కొన్నారని చెప్పారు.

కేసు నేపథ్యం…
జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా.. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ ప్రదేశాన్ని సీల్‌ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జ్ఞాన్​వాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్​కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.

అసలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది?
1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం తీసుకొచ్చారు. 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో అద్వానీ రథయాత్ర, యూపీలాంటిచోట్ల మతరపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న రోజుల్లో 1991 సెప్టెంబర్ 18న నాటి పివి నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది.

ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో, అదే రూపంలో కొనసాగుతాయి. వాటి యథాతథ స్థితిని మార్చకూడదు. దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలకు ఇది వర్తిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు అయినా, మధురలోని షాహీ ఈద్గా అయినా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles