28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రధాని వస్తున్నారని రాత్రికి రాత్రే రంగులు… మోర్బీలో ఆసుపత్రికి మరమ్మతులు!

అహ్మదాబాద్:  గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు మోర్బీలో పర్యటించనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో మోర్బీ అధికారులు అప్రమత్తమయ్యారు.

మోర్బి సివిల్ ఆసుపత్రి గోడలకు రాత్రికి రాత్రే  రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. రాత్రిపూట మరమ్మతులు జరుగుతుండడంతో స్థానిక మీడియా అక్కడికి చేరుకుంది. రంగులు వేస్తున్న సిబ్బందిని, ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మతులను ఫొటోలు తీసి ప్రసారం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాయి.

అర్ధరాత్రి ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోషూట్ కోసం బీజేపీ బిజీబిజీగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా బాగుందని ప్రధానికి చూపించేందుకు అధికారులు అర్ధరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్లో ఆరోపించింది.

ఓవైపు పెద్ద సంఖ్యలో జనం చనిపోవడం, బాధిత కుటుంబాలు తీరని దుఖంలో మునిగిపోగా.. బీజేపీ పెద్దలు మాత్రం ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లలో మునిగిపోవడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

మోర్బి సివిల్ ఆసుపత్రికి రంగులేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిని మోదీ పరామర్శించే అవకాశం ఉంది. దీంతో, ఆసుపత్రిని సమస్యల వలయంగా ఉంచిన తమ నిర్లక్ష్యం బయటపడకుండా అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

గత రాత్రి మొత్తం ఆసుపత్రికి రంగులు వేయించడం, పాడైపోయిన పరికరాలను బాగు చేయించడం వంటి పనుల్లోనే అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రికి రాత్రి కొత్త వాటర్ కూలర్లను తెప్పించి పెట్టారు. పాడైపోయిన గోడలను బాగుచేయించారు. ఆసుపత్రిలోని ఓ వార్డులో బెడ్ షీట్లను మార్చారు.

గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి హేమంగ్ రావల్ మాట్లాడుతూ.. మోర్చిలోని సివిల్ ఆస్పత్రిలో పెయింటింగ్, డెకరేషన్ పనులు జరుగుతున్నాయని… బీజేపీ కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుందని.. పెయింటింగ్, డెకరేషన్ బదులు బాధితులకు మంచి చికిత్స అందిచాలని డిమాండ్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles