23.7 C
Hyderabad
Monday, September 30, 2024

మూడు దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్ Vs ప్రభుత్వాలు… తెలంగాణలో యుద్ధం!

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం నియమించిన గవర్నర్లు మూడు దక్షిణాది రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలపై పూర్తి యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య తీవ్ర యుద్ధమే జరుగుతోంది.  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఈ వివాదాన్ని పూర్తిగా భిన్నమైన స్థాయికి తీసుకువెళ్లారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్రం రాష్ట్రంపై అన్ని వైపుల నుండి దాడి మొదలుపెట్టింది.  ముఖ్యంగా నిధులు, గ్రాంట్లు నిలిపివేయడం ద్వారా ఒత్తిడి పెంచడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై ఏకపక్షంగా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కింద రుణాలపై ఆంక్షలు విధించింది. ఇది కాకుండా, గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులు, గ్రాంట్లు, నష్టపరిహారాల రూపంలో కేంద్రం రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా బకాయి సహా అనేక చర్యల ద్వారా బీజేపీ యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న తరుణంలో గవర్నర్ సౌందరరాజన్ తీరు ఆసక్తికరంగా మారింది.

తాజాగా యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లు పెండింగ్‌ వ్యవహారం మరోసారి ఇద్దరి మధ్య మంటలు రాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్‌ తర్వాత గవర్నర్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షాని కలిసి వచ్చిన మరుసటి రోజు నుంచి తమిళిసై దూకుడు మరింత పెంచారు.  గతంలో ఏ గవర్నర్ కూడా ప్రెస్ మీట్ లు పెట్టింది లేదు.  కానీ తెలంగాణ గవర్నర్ కొత్త సంస్కృతికి తెరతీశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆమె ప్రైవసీకి భంగం కలుగుతోందని చెప్పారు. ప్రగతి భవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయని చెబుతూ.. రాజకీయ విమర్శలు కూడా గవర్నర్ చేస్తున్నారు.

తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలంటున్న డీఎంకే !
తమిళనాడు గవర్నర్‌ కూడా డిఎంకె ప్రభుత్వంతో ఢీ కొడుతున్నారు. ఇటీవల అధికారపార్టీతో పాటు పలు తమిళపార్టీలు హిందీ భాషని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. దీంతో మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో ఇప్పుడు గవర్నర్‌ వర్సెస్‌ సిఎం మధ్య నిప్పు రాజేసుకుంది. అసలు మాకు ఈ గవర్నర్‌ వద్దని తమిళనాడు సిఎం స్టాలిన్‌ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాయడం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు. వెనక్కి పంపిస్తున్నారు. పాలనకు అడ్డం పడుతున్నారని స్టాలిన్ మండి పడుతున్నారు.

కేరళలో యూనివర్శిటీలకు గవర్నర్ చాన్సలర్ కాదని ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం !
కేరళలో కూడా సేమ్‌ సీన్‌ రిపీటవుతోంది. యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకం బిల్లు ఆమోదంపై మొదలైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. గవర్నర్‌ జోక్యాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న చట్ట సవరణ బిల్లుపై ఆమోదానికి ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పెండింగ్‌ లో పెట్టడంతో రాజ్‌ భవన్‌ ఎదుట అధికారపార్టీ నేతలు నిరసనకు దిగుతున్నారు. నిన్నటివరకు ఢిల్లీ, బెంగాల్లో సాగిన గవర్నర్‌ వర్సెస్‌ సిఎం వ్యవహారం ఇప్పుడు ఇప్పుడు సౌత్‌ లో ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles