33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ప్రధాని’నైనా ప్రశ్నించే ‘సీఈసీ’ కావాలి… సుప్రీంకోర్టు!

నూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్‌ స్వతంత్రంగా వ్యవహరించాలని, అవసరమైతే ప్రధానమంత్రి మీద కూడా చర్య తీసుకోగలిగేవారై ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని, ఆయన స్వతంత్రంగా వ్యవహరించగలగాలని వ్యాఖ్యానించింది.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవిని కాపాడుకోవాలనే చూస్తోందని.. అందుకే అన్నింట్లోనూ తమకు ‘యస్’ అంటూ తలూపే వ్యక్తులనే సీఈసీగా, ఈసీలుగా నియమిస్తోందంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రధానిపై ఫిర్యాదులు వస్తే.. ఆయన ద్వారా నియమితులైన సీఈసీ చర్యలు తీసుకోగలరా?” అని బెంచ్ ప్రశ్నించింది.   ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా పని చేయాలంటే సీఈసీ, ఈసీల ఎంపికకు ఒక మెకానిజం ఉండాలని, అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కూడా చోటు కల్పించాలని అభిప్రాయపడింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. దినేశ్ గోస్వామి కమిటీ సిఫార్సుల మేరకు పార్లమెంట్ ఈసీ యాక్ట్ 1991ను ఆమోదించిందని, అందువల్ల ఈసీలు, సీఈసీ నియామక ప్రక్రియ సరిగ్గాలేదన్న వాదనకు తావు లేదన్నారు. ఈసీ చట్టం ప్రకారం ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగానే కొనసాగుతోందని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఎన్నికల కమిషనర్లలో సీనియర్ నే సీఈసీగా నియమించడం, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ స్థాయిలో పని చేసిన అధికారులనే ఎన్నికల కమిషనర్లుగా అపాయింట్ చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ‘‘సీనియర్ బ్యూరోక్రాట్ల పేర్లతో లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్ ను న్యాయ శాఖకు పంపుతారు. అక్కడి నుంచి లిస్ట్ ప్రధానికి ఫార్వర్డ్ అవుతుంది. ప్రధాని ఎంపిక చేసే వ్యక్తులను రాష్ట్రపతి ఈసీలు, సీఈసీగా నియమిస్తారు” అని వివరించారు.

గోయల్ నియామక పత్రాలు తీసుకురండి…
ఇక, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తాజా నియామకాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఆ నియామకం ఎలా చేపట్టారని ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 72 ఏళ్లుగా చట్టం తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించింది. సీఈసీ, ఈసీ నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles