24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం… హిమాచల్‌లో కాంగెస్!

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే  గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ ఓట్లను చీల్చడంతో గుజరాత్‌లో బిజెపి అత్యుత్తమ ఫలితాలు పొందినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.   82 స్థానాలు ఉన్న గుజ‌రాత్‌లో.. బీజేపీ ఇప్ప‌టికే 156 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌కు 26.5 శాతం, ఆమ్ ఆద్మీకి 12.9 శాతం ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని పీఠాన్ని అధిష్టించబోతోంది.

గుజరాత్​లోని అన్ని ప్రాంతాల్లో భాజపా హవా కనిపించింది. సౌరాష్ట్ర సహా ఉత్తర, దక్షిణ గుజరాత్​లో ఓటర్లు భాజపాకే జై కొట్టారు. ఆరంభంలో కచ్​లో కాస్త ప్రతికూల పవనాలు వీచినట్లు కనిపించినా.. చివరకు భాజపాదే హవా అని తేలింది. తద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థానాలు కైవసం చేసుకోగలిగింది. ఈ ఎన్నికల్లో భాజపా అనేక రికార్డులు కొల్లగొట్టింది. వరుసగా ఏడు ఎన్నికల్లో గెలుపొందిన రెండో పార్టీగా చరిత్ర లిఖించింది.

భాజపా వైపు మళ్లిన పాటీదార్లు..
గుజరాత్‌ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. 1990 నుంచి పాటీదార్లు భాజపాకు మద్దతుగా ఉన్నారు. అయితే 2015లో హార్దిక్‌ పటేల్‌ సారథ్యంలో జరిగిన పాటీదార్ ఉద్యమాన్ని భాజపా అణిచివేసింది.  అది భాజపాకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. 2017 ఎన్నికల్లో భాజపా 99 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 77 సీట్లు గెలుచుకుంది.

అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భాజపా.. పటేల్​ ఓటర్ల విషయంలో జాగ్రత్త పడింది. పటేల్‌ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొవిడ్‌ అనంతరం ముఖ్యమంత్రి విజయ్​ రూపాణీని మార్చి.. భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించింది. అలాగే పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్​ను పార్టీలో చేర్చుకుని.. ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించుకుంది. అంతేకాదు గిరిజనుల ఓట్లను పొందడంలోనూ ఈ సారి భాజపా సఫలం అయింది. ఇక ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను, మంత్రులను సైతం పక్కనబెట్టి కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన ఎమ్మెల్యేలకు భాజపా టిక్కెట్లు ఇచ్చింది.

డిసెంబరు 11 లేదా 12న గుజరాత్ కొత్త సీఎం ప్రమాణం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా సాగుతోంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 92 స్థానాల్లో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం బీజేపీ 131 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసి, మరో 26 చోట్ల పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 11 లేదా 12 కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం.

గుజరాతీలకు ధన్యవాదాలు: అమిత్ షా

గుజరాత్‌లో విజయాన్ని అందించిన ప్రజలకు హోంశాఖ మంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాపై విశ్వాసాన్ని ప్రకటిస్తుందని ఆయన అన్నారు.

ఎంఐఎం, ఆప్‌లతో చీలిపోయిన ముస్లిం ఓట్లు.. బీజేపీకి లబ్ది

ముస్లిం ఓటర్లు ఆధిపత్యం ఉండే స్థానాల్లోనూ ఆ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టకుండానే బీజేపీ మెజార్టీ సీట్లను గెలుపొందింది. ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే 17 సీట్లలో 12 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. కేవలం ఐదు సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీనికి కారణం ఆ స్థానాల్లో ఎంఐఎం, ఆప్‌లు పోటీచేయడంతో ఓట్లు చీలి బీజేపీకి లబ్ది చేకూరింది.

ఫలితాలు షాక్‌కు గురిచేశాయి.. గుజరాత్ పీసీసీ చీఫ్

గుజరాత్‌ ఫలితాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ జగదీష్‌ ఠాకూర్‌ స్పందించారు. ఈ ఫలితాలు తనని షాక్‌కు గురిచేశాయని, మళ్లీ బీజేపీకి అధికారం ఇవ్వాలన్న గుజరాత్‌ ప్రజల తీర్పు నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ శక్తివంచన లేకుండా కష్టపడిందని, అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యామని అన్నారు. అదే సమయంలో భారీగా ఓటు శాతాన్ని కోల్పోవడంపైనా పార్టీలో అంతర్గతంగా చర్చించనున్నట్లు వివరించారు.

హిమాచల్​లో కాంగ్రెస్​దే గెలుపు

మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దె దించే పద్ధతిని ఈసారీ పాటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఓటమి చవిచూడగా.. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles