23.7 C
Hyderabad
Monday, September 30, 2024

దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది… హెచ్చరించిన రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్‌ వరకు 3500 కి.మీల పాటు భారత్‌ జోడో పేరిట సుధీర్ఘ యాత్ర చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ శుక్రవారం దేశ పౌరులను ఉద్దేశించి లేఖ రాశారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశంలో ‘స్పష్టమైన ఆర్థిక సంక్షోభం’ ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ప్రజలను హెచ్చరించారు.

యువతలో నిరుద్యోగం ప్రబలుతోంది. ధరల పెరుగుదల భరించలేనంతగా ఉంది. వ్యవసాయ కష్టాలు తీవ్రమయ్యాయి. దేశ సంపదను పూర్తిగా కార్పొరేట్ స్వాధీనం చేసుకుంది. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు, వారి ఆదాయాలు మరింత పడిపోతున్నాయి. వారి కలల భవిష్యత్తు ఛిన్నాభిన్నం అవుతోంది. దేశమంతటా తీవ్ర నిస్సహాయత ఉంది’’ అని రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర తర్వాత… జనవరి 26 నుండి మార్చి 26 వరకు జరిగే  ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ గురించి కాంగ్రెస్  పార్టీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ శుక్రవారం దేశ రాజధానిలో మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తారని చెప్పారు. – ఆ సమయంలో రాహుల్ గాంధీ లేఖను ప్రజలకు అందజేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.

హాత్ సే హాత్ జోడో అభియాన్ కింద, దాదాపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6 లక్షల గ్రామాలు,10 లక్షల పోలింగ్ స్టేషన్‌ల పరిథిలోని ప్రజలకు ఈ లేఖను అందజేయాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

రాహుల్ గాంధీ లేఖలో ముఖ్యాంశాలు…

‘మీ హృదయాల నుండి భయాన్ని తొలగించండి’ అని ఆయన ప్రజల్ని కోరారు. “డరో మత్ (భయపడకండి)” అని రాహల్ గాంధీ అన్నారు.

“మన దేశంలో ఉన్న వైవిధ్యాన్ని గ్రహించి… భుజం భుజం కలిపి పని చేస్తే తప్ప మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేమని మన దేశ ప్రజలు గ్రహించాలన్నారు. భారతదేశం… ద్వేషాన్ని తిరస్కరిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేము కులం, మతం, భాష, లింగం, అన్ని ఇతర భేదాలకు అతీతంగా ఎదుగుతాము. భిన్నత్వంలో మన ఏకత్వంలో మన గొప్పతనం ఉంది. మీలో ప్రతి ఒక్కరికీ నేనిచ్చే సందేశం ఒకటే- భయపడకండి.. మీ హృదయాల నుండి భయాన్ని తొలగించండి. అప్పుడే మీలోని ద్వేషం తొలగిపోతుంది” అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

“గాంధీ లేఖతో పాటు, హాత్ సే హాత్ జోడో అభియాన్ సమయంలో, ఛార్జ్ షీట్, బిజెపి ప్రభుత్వ వైఫల్యాల జాబితాను కూడా పౌరులకు అందజేస్తాము” అని జైరామ్ రమేష్ చెప్పారు. రాహుల్ గాంధీ లేఖను ప్రాంతీయ భాషల్లో కూడా రాయనున్నట్లు ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో రాహుల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ముగుస్తుంది. పాదయాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లను దాటి ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతోంది. భారత్ జోడో యాత్ర భారతదేశ చరిత్రలో ఓ రాజకీయ నాయకుడు కాలినడకన సాగిన సుదీర్ఘ యాత్ర అని కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles