28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

చైనా ఆక్రమణలో భారత భూభాగం… కేంద్రం వైఖరి ప్రమాదకరమన్న రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం శ్రీనగర్‌లో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… లడఖ్‌లోని సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగం చైనా ఆక్రమణలో ఉందని అన్నారు.  చైనా సైన్యం మన భూమిని ఆక్రమించిందని అంగీకరించడానికి నిరాకరించే కేంద్ర ప్రభుత్వ విధానం అత్యంత ప్రమాదకరం అన్నారు. చైనాతో మన దేశం మరింత కఠినంగా వ్యవహరించాలని మన భూమిని పరాయి దేశస్తుల పరం కాకుండా చూడాలన్నారు.

ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన కేంద్రంపై మండిపడ్డారు. 2021లో లడఖ్‌లోని గాల్వాన్‌లో జరిగిన ఘర్షణల తర్వాత తాను లేవనెత్తిన ఆరోపణను పునరుద్ఘాటించారు… భారతదేశం నుండి చైనీయులు ఎలాంటి భూమిని తీసుకోలేదనే భావనలో దేశం ఉందని గాంధీ అన్నారు.

“నేను ఇటీవల కొంతమంది మాజీ సైనికులను కలిశాను. లడఖ్ నుండి వచ్చిన ప్రతినిధి బృందం కూడా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టంగా చెప్పారు. భారత భూభాగంలో ఉన్న అనేక పెట్రోలింగ్ పాయింట్లు చైనీస్ చేతిలో” ఉన్నాయని రాహుల్ గాంధీ  అన్నారు. భారత్ జోడో యాత్రలో కూడా, రాహుల్  గాంధీ ఈ సమస్య గురించి చాలాసార్లు మాట్లాడారు. సినీ నటుడు కమల్ హసన్‌తో జరిగిన చిట్ చాట్ కార్యక్రమంలోనూ చైనా ఆక్రమణల అంశాన్ని ప్రస్తావించారు.

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ విధానంలా తాము చైనాకు లొంగబోమని బీజేపీ పేర్కొంది. ఆయా అంశాలపై  రాహుల్ గాంధీకి సరైన అవగాహన లేదని, ఆయన అయోమయంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది.

భారత భూభాగంలోని 65 పెట్రోల్ పాయింట్లలో..26  పాయింట్లను  కోల్పోయామన్న నివేదికపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ…  ఈ భూమి “వాస్తవానికి 1962లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆక్రమణకు” గురైందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదని విదేశాంగమంత్రి అన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles