24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

కేంద్ర బడ్జెట్ 2023-24… అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం!

న్యూఢిల్లీ: నూటా నలభై కోట్ల ప్రజలు ఆశలు, మరెన్నో అంచనాల మధ్య కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ 2023-24ను  పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది అమృత కాలంలో మొదటి బడ్జెట్ అని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు వివరించారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని నిర్మలా సీతారామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దఫా వృద్ధి రేటు 7 శాతం వుంటుందని అంచనా వేస్తున్నామని ప్రకటించారు. భారత్‌ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆమె అన్నారు. ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు. గంటా 26 నిమిషాలపాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.

ఈ సారి బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనిచ్చారు.  కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఏడు లక్షల వరకు ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని.. కొత్త పొదుపు పథకం ప్రవేశపెడుతున్నామని అన్నారు. వ్యవసాయాభివృద్ధిలో భాగంగా రైతుల కోసం సమ్మాన్‌ నిధిని పెంచుతున్నామని ప్రకటించారు. చిరుధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం 13.7 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకకు పెద్ద పీట వేశారు. కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

  • అన్నివర్గాల సంక్షేమమే టార్గెట్‌..

అమృత కాలంలో…. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన స్వర్ణయుగంలో ఇదే తొలి బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా యువతకు, అన్ని తరగతుల ప్రజలకు ఆర్థిక బలాన్ని అందించేందుకు కృషి చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఉన్నప్పటికీ, మన ప్రస్తుత వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉంది. ఈ క్లిష్ట  సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ అభివృద్ధిని మెచ్చుకున్నారు. ఈ బడ్జెట్‌ రాబోయే 25 సంవత్సరాలకు బ్లూ ప్రింట్‌. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచం భారతదేశ బలాన్ని గుర్తించిందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఏడు అంశాలకు ప్రాధాన్యత..

  • సమ్మిళిత అభివృద్ధి
  • చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు
  • భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు
  • దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట
  • పర్యావరణ అనుకూల అభివృద్ధి
  • యువశక్తి
  •  పటిష్టమైన ఆర్థిక రంగం

రైల్వే, రక్షణ, వ్యవసాయానికి బడ్జెట్‌లో పెద్ద పీట…

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే రంగానికి భారీ మొత్తంలో కేటాయింపులు దక్కాయి. రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది మోడీ సర్కార్. రైల్వే మినిస్ట్రీకి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ అందించడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రైల్వేకు రూ. లక్ష 40 వేల కోట్ల నిధులు కేటాయించారు. అప్పుడే నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేళ్లలో భారత్ 400 వందే భారత్ రైళ్లను తయారు చేస్తుందని ప్రకటించారు.

ఇక చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌నూ సుమారు 70 వేల కోట్ల రూపాయల మేర పెంచింది. 2023-24కి గాను ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.5.94 లక్షల కోట్లు కేటాయించింది.

ఈ బడ్జెట్ లో మంత్రి వ్యవసాయ రంగానికీ పెద్దపీట వేశారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు.  ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2023-24లో కీలక ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ధ‌ర‌లు, కిచెన్ చిమ్నీల ధరలు తగ్గనున్నాయని చెప్పారు. అదే సమయంలో సిగ‌రెట్ల ధ‌ర‌లు, ర‌బ్బ‌ర్, బ‌ట్ట‌లు, సిమెంట్, వాహ‌నాల టైర్ల ధ‌ర‌లు పెరగనున్నాయి. టీవీ విడిభాగాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించబడింది.

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీంతో బంగారం, వెండి, డైమండ్స్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ 2023-24 అనంతరం ఆ ధరలు మరింత పెరగనున్నాయి. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది.

బడ్జెట్‌ 2023-24లో త‌గ్గే వస్తు ధరలు: 
మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ధ‌ర‌లు, కిచెన్ చిమ్నీలు.

బడ్జెట్‌ 2023-24లో పెరిగే వస్తు ధరలు: 
సిగ‌రెట్ల ధ‌ర‌లు, ఇంపోర్టెడ్ ర‌బ్బ‌ర్, బ‌ట్ట‌లు, బంగారం, వెండి, డైమండ్స్, సిమెంట్, వాహ‌నాల టైర్లు.

సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితి రెట్టింపు

సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ  ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉండగా.. దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.

మహిళల కోసం ప్రత్యేక పథకం

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళల కోసం కొత్త పొదుపు పథకం వస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ బడ్జెట్ లో మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

మహిళల కోసం కేంద్రం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకం 2025వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు. ఈ పథకంలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్ పై 7.5 శాతం వడ్డీ ఉంటుంది. ఏదైనా మహిళ, అమ్మాయి ఖాతా ద్వారా డిపాజిట్ చేయవచ్చు. దాని నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు షరతులు ఉంటాయి. అవసరమైనప్పుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles