31 C
Hyderabad
Tuesday, October 1, 2024

అదానీ గ్రూపుపై ఆరోపణలు… ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆథ్వర్యంలో దేశవ్యాప్త నిరసన!

న్యూఢిల్లీ : అదానీ గ్రూపు అవకతవకలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదిక దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6న  దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

అన్ని జిల్లాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల వద్ద సోమవారం నిరసన కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనలు నిర్వహించనుంది.  ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సూచనలు ఇవ్వాలని పీసీసీలను కోరినట్లు ఆయన చెప్పారు. ప్రధానికి సన్నిహితులైన మిత్రుల కోసం ప్రజల కష్టార్జితాన్ని పణంగా పెట్టడం ప్రభుత్వానికి తగదని ఆయన అన్నారు.

అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి మొత్తం ₹36,474.78 కోట్లు పెట్టుబడి పెట్టింది. భారతీయ బ్యాంకులు కలిసి దాదాపు ₹80,000 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి పెట్టాయి. అదాని గ్రూపుపై స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం, ఇతర అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వరంగ సంస్థలు తమ పెట్టుబడులను అలానే కొనసాగిస్తున్నాయి. ఆరోపణలు బహిర్గతం అయినప్పటి నుండి అదానీ  గ్రూప్ $100 బిలియన్లను కోల్పోయింది” అని పార్టీ ప్రధాన కార్యదర్శి  K. C. వేణుగోపాల్ అన్నారు.

అదానీ సంస్థ మోసంపై పార్లమెంట్‌ కమిటీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని,   రోజువారీ  నివేదికను సమర్పించాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది.  అదానీ వ్యవహరం వల్ల ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆ గ్రూపులో పెట్టిన పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ, “మేము ఏ ప్రత్యేక భారతీయ కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకం కాదు, మేము క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకం. ఎంపిక చేసిన బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలను మార‌్చడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.

మరోవంక అదానీ – హిండెన్ బర్గ్ నివేదిక  అంశం గురువారం పార్లమెంటును కుదిపేసింది. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తో కలిసి విపక్షాల నేతలు మీడియాతో మాట్లాడారు. ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్ల మంది ప్రజలు పెట్టుబడులు ఉన్నాయనీ, వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు.

ప్రదాన మంత్రి మోడీకి సన్నిహితుడుగా పేరున్న గౌతమ్ ఆదానీకి సంబంధించి సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లుగా హిండెన్ బర్గ్ నివేదిక లో పేర్కొనడం, ఆ వెంటనే ఆదానీ గ్రుప్ షేర్లు భారీగా పతనం కావడం అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లు అయ్యింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles