24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీబీసీ ఆఫీసులపై ఐటీ సోదాలు!

న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్లపై సంచలనాత్మక డాక్యుమెంటరీ రూపొందించిన బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (బీబీసీ)పై మోడీ ప్రభుత్వం‌ ప్రతీకార చర్యలకు దిగింది. భారత్‌లోని బీబీసీ కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బీబీసీ-ఢిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వే నిర్వహించారని జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతుతోందని తెలిసింది. బీబీసీలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది ఎవర్నీ బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. సోదాలు మొదలైన కొద్ది గంటలకు కొంతమందిని వారి ఇళ్లకు పంపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఐటీ దాడుల వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

”ఇది కేవలం సర్వే మాత్రమే. ఐటీ దాడులు కాదు” అని ఐటీ అధికారులు మీడియాకు తెలిపారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు కంప్యూటర్లు వాడొద్దని, ఇంట్లోనే ఉండాలని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. పాత్రికేయుల ఫోన్లను, ల్యాప్‌ట్యాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అవకతవకలకు సంబంధించి ఏవైనా ఆధారాలు గుర్తిస్తే, ఈ సర్వేను కాస్తా ఐటీ సోదాలుగా మార్చే అవకాశముందని సంబంధిత అధికారుల్లో ఒకరు మీడియాకు చెప్పారు. తమ కార్యాలయాల్లో ఐటీ విభాగం నిర్వహిస్తున్న సర్వేపై బీబీసీ స్పందించింది. ”ప్రస్తుతం ముంబయి, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులున్నారు. మేం వారికి సహకరిస్తున్నాం. ఈ వ్యవహారం త్వరలోనే సద్దుమణుగుతుందని ఆశిస్తున్నాం” అని ట్వీట్‌ చేసింది.

డాక్యుమెంటరీ ప్రసారం చేసిందనే…

గుజరాత్‌ 2002 మత ఘర్షణలకు బాధ్యుడు ఆనాటి సీఎం నరేంద్రమోడీయేనని పేర్కొంటూ బీబీసీ రెండు భాగాలుగా ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది భారత్‌లోనూ, విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. పాలకుల మద్దతు, వారి ప్రోద్బలంతోనే మైనార్టీలు లక్ష్యంగా హింసాకాండ చెలరేగిందని డాక్యుమెంటరీలో చూపారు. ఈ డాక్యుమెంటరీ మనదేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ డాక్యుమెంటరీ భారత్‌లో విడుదల చేయరాదని మోడీ సర్కార్‌ ఆంక్షలు విధించింది. దాంతో బీబీసీ వెబ్‌సైట్‌ నుంచి కొద్ది గంటల్లోనే వీడియోను తొలగించారు. అయితే ‘ఇండియా : ద మోడీ క్వశ్చన్‌’ అనే ఈ డాక్యుమెంటరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సామాజిక మాధ్యమా ల్లోనూ దీనిని ప్రసారం చేయవద్దని, దీనికి సంబంధించిన ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 21న ఆదేశించింది. ఈ వ్యవహరంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మోడీ సర్కార్‌ ప్రతీకార చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నించినప్పటికీ, దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో వీడియోను ప్రదర్శించారు. ఈ డాక్యు మెంటరీ ప్రసారంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌…!
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడుల్ని ‘ద ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ (ఈజీఐ) తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. మీడియా సంస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే..ప్రతీకార ధోరణితో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దాడులకు దిగుతున్నాయని ఈజీఐ అభిప్రాయపడింది. మీడియా సంస్థల్ని లక్ష్యంగా చేసుకొని పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించింది.

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం – జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
ఐటీ దాడులపై నేషనల్‌ ఎలియన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏజే), ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (డీయూజే) తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చ రించాయి. ప్రభుత్వ ఏజెన్సీ లను ఉపయోగించుకుని ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని భయపెట్టే ధోరణికి ఈ దాడులు కొనసాగింపేనని తెలిపాయి. జర్నలిస్టులు, మీడియా సంస్థల హక్కులను ప్రభు త్వం కాలరాస్తున్నదని విమర్శించాయి. పత్రికా సెన్సార్‌షిప్‌కు, జర్నలిజంపై నియంత్రణకు పరాకాష్ట అని మీడియా సంస్థలు విమర్శించాయి.

అప్రకటిత ఎమర్జెన్సీ : కాంగ్రెస్‌
ప్రధాని మోడీపై వీడియో ప్రసారం చేసినం దునే ఐటీ దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌..తదితర పార్టీలకు చెందిన విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని కాంగ్రెస్‌ విమర్శించింది. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు చేపట్టడంపై కాంగ్రెస్‌ మండిపడింది. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు…’సైద్ధాంతిక ఎమర్జెన్సీ’ని తలపిస్తున్నాయి” అంటూ అఖిలేష్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles