28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

త్రిపురలో నేడు పోలింగ్!

అగర్తల : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.   ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.   రాష్ట్రవ్యాప్తంగా 3337 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 28,14,584 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పోలింగ్‌ కేంద్రాలన్నింటిలోనూ వెబ్‌ కేస్టింగ్‌ సౌకర్యాన్ని కల్పించారు. 97 పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేకంగా మహిళలే నిర్వహించనున్నారు. వికలాంగుల కోసం 44 స్టేషన్లను ఏర్పాటు చేశారు. శాసనసభలోని 60 స్థానాలకు మొత్తంగా 259 మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. 55 సీట్లకు బిజెపి పోటీ చేస్తుండగా, మిగిలిన ఐదు స్థానాల్లో దాని భాగస్వామ్య పక్షం ఐపిఎఫ్‌టి పోటీ చేస్తోంది. వామపక్ష సంఘటన 47 స్థానాలకు పోటీ చేస్తుండగా, మిగిలిన 13 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ పడుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఓటర్లను ఓటు వేయనీయకుండా ఎవ్వరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

త్రిపురలో గతంలో సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉండేది. అయితే బీజేపీని అడ్డుకునేందుకు ఈసారి కాంగ్రెస్‍తో జతకట్టింది సీపీఎం. వామపక్షాలు, కాంగ్రెస్ కూటమిగా పోటీకి వచ్చాయి. ఇక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(IPTF)తో కలిసి బరిలోకి దిగుతోంది కాషాయ పార్టీ. ఇక కొత్తగా ఏర్పాటైన పార్టీ తిప్రా మోత ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

బీజేపీ మళ్లీ గెలుస్తుందా…

త్రిపురను సీపీఎం పార్టీ సుమారు మూడు దశాబ్దాలు పరిపాలించింది. అయితే 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు సాధించి అధికారం చేపట్టింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ కీలక నేతలంతా ఈసారి త్రిపురలో ముమ్మరంగా ప్రచారం చేశారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయి. కాగా, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీకి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు కూడా మార్చి 2నే రానున్నాయి.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles