33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అక్రమాలకు పాల్పడుతోంది…సీపీఎం!

మాగులపల్లి(నల్గొండ): బీజేపీ వల్ల దేశానికి ప్రమాదమని, రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ రాజకీయంగా దిగజారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మాడ్గులపల్లి మండల కేంద్రంలో సీపీఎం కార్యాలయ నూతన భవనాన్ని వీరభద్రం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు.

కేంద్ర, రాష్ట్ర భాజపా నాయకులు తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకోసం వివిధ పార్టీల నాయకులను ఫిరాయింపులను ప్రోత్సహించడానికి సిద్ధమైందన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని మిగిలినవారు రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హిందువుల దేశంగా ఉండాలని, మిగిలిన మతాల వారు ఉండే అవకాశంగా లేదని అన్నారు.

ఈడీ, సీబీఐలను ఉపయోగించి ప్రత్యక్షంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే కవితపై ఈడీ దాడులు చేపడుతున్నారని ఆరోపించారు. బీజేపీని గద్దెదించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడంతో కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీని గద్దె దించడం కోసం కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. మార్చి 17 నుండి 29 వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ బండారం బయటపెట్టడానికి 33 జిల్లాల్లో జన చైతన్య యాత్రలను 15 రోజులపాటు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎర్రజెండా ఉద్యమ శక్తిగా ప్రాముఖ్యమైన శక్తిగా ఎదుగుతుందన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సీపీఎం నాయకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని, ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు.

ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరువుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు డబ్బికర్ మల్లేశం, సయ్యద్ హాషం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, మహ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, నన్నూరి గోవర్ధనరెడ్డి గౌతంరెడ్డి, రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles