23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

మురికివాడల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ…జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్: మురికివాడల్లో నివసించే వారి జీవన ప్రమాణాల పెంపునకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ చర్యలు తీసుకుంటోంది. పౌరాభివృద్ధి పనులతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి, అప్‌గ్రేడేషన్ శిక్షణను అందించడానికి GHMC లైట్‌హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (LCF)తో భాగస్వామ్యం చేసుకుంది. తద్వారా ఏటా 500 మందికి శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.

సోమవారం తెలంగాణలోనే తొలి లైట్‌హౌస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శేరిలింగంపల్లి మండల పరిధిలోని చందానగర్ హుడా కాలనీలోని జీహెచ్‌ఎంసీ మోడల్ మార్కెట్ భవనంలో జీహెచ్‌ఎంసీ, ఎల్‌సీఎఫ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… సమాజంలో ఎదగడానికి అవకాశం లేని యువత… సాధికారత సాధించేందుకు ఎల్ సిఎఫ్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను అందుకునేలా చేస్తుంది. అంతేకాదు వారు స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలను కూడా ప్రోత్సహిస్తుంది. జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం ద్వారా పాపిరెడ్డి కాలనీ, శాంతి నగర్‌, వేముకుంట, గోపీనగర్‌తో పాటు తక్కువ ఆదాయం ఉన్న నగరవాసులు నివసించే ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత పేర్లు నమోదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులకు టైలరింగ్, బ్యూటీషియన్, రిటైల్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అందిస్తుంది. ఇప్పటి వరకు 150 మంది శిక్షణ కోసం నమోదు చేసుకోగా, 36 మంది ప్లేస్‌మెంట్‌లు పొంది నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నారు.

అంతేకాదు ఎంపికైన యువత, మహిళలకు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, వెబ్ డెవలప్‌మెంట్, నర్సింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, జావా, డేటా ఎంట్రీ, నాన్-వాయిస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సహా IT – ITESలో శిక్షణ ఇవ్వనున్నారు.

లైట్‌హౌస్‌ ద్వారా యువతకు మంచి కెరీర్‌ను ఎంచుకునేలా ప్రోత్సాహం, శిక్షణ ఇస్తున్నామని లైట్‌హౌస్‌ సీఈవో రుచి పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 1.3 లక్షల మంది యువత లబ్ధి పొందారని ఆమె తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles