33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం…జూన్ 9న ప్రారంభించనున్న పథకాన్ని సీఎం కేసీఆర్!

హైదరాబాద్: కులవృత్తులు చేసుకునే బీసీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.  రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర చేతివృత్తులు చేసుకునే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జూన్ 9న మంచిర్యాలలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సూచనలు చేశారు. చేతివృత్తిదారులకు ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా అందించే ఆర్థిక సహాయం చేతివృత్తిదారుల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పథకం దుర్వినియోగం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్త పథకం ద్వారా లబ్ధిదారులను గుర్తించి, ప్రతినెలా 15వ తేదీన లబ్ధిదారులకు సంబంధిత ఎమ్మెల్యేలచే చెక్కులను పంపిణీ చేస్తామని మంత్రి కమలాకర్ తెలిపారు. లబ్ధిదారులు చేతి వృత్తికి సంబంధించిన పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గత క్యాబినెట్‌ సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు విధివిధానాలను ఇప్పటికే ఖరారు చేసిందని వెల్లడించారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పథకం మార్గదర్శకాలు..

  • బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అర్హులు.
  • పనిముట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.
  • అభ్యర్థుల వయస్సు జూన్‌ 2 నాటికి 18 -55 ఏండ్లు ఉండాలి.
  • వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
  • కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు.
  • దరఖాస్తు తేదీ నుంచి గత 5 ఏండ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధిపొందినవారు, 2017-18లో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారు అనర్హులు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ …

  • జూన్‌ 20 తేదీ వరకు https://tsobmmsbc. cgg.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
  • రేషన్‌కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను దరఖాస్తుతో సమర్పించాలి.
  • జూన్‌ 20 నుంచి జూన్‌ 26వ తేదీ వరకు మండలస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.
  • జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి నివేదిస్తారు.
  • ఆ కమిటీ అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేసి జూన్‌ 27వ తేదీలోగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
  • రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు.
  • ఆ తర్వాత లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు నేరుగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
  • ఆర్థికసాయం పొందిన నెలలోగా ఆ నిధులతో పనిముట్లు, ముడిసరుకును లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
  • ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో యూనిట్ల గ్రౌండింగ్‌ను పర్యవేక్షిస్తారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles