31 C
Hyderabad
Tuesday, October 1, 2024

యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం…సీఎం కేసీఆర్!

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ (యూసీసీ)ను వ్యతిరేకిస్తు్న్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) పేరుతో దేశ ప్రజలను విభజించేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతోందని ఆయన విమర్శించారు. మన దేశంలో విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు  ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని అన్నారు. అలాంటి భారత ప్రజల ఐక్యతను చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తాము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తామని అన్నారు. అందులో భాగంగానే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ తేల్చి చెప్పారు.

సోమవారం ప్రగతిభవన్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ప్రెసిడెంట్ ఖలీద్ సైఫుల్లా రహ్మానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో ఈ బిల్లు సహా పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ బిల్లును బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందని.. భావ సారూప్య పార్టీలతో కలిసి దీనిపై పోరాడుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావులను సీఎం ఆదేశించారు.

మతాలకు ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగా జమున తహజీబ్‌ను రక్షించడానికి ముందుకు రావాలనే తమ అభ్యర్థనను అర్థం చేసుకుని తక్షణమే స్పందించినందుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు సీఎంకు ధన్యవాదాలు తెలిపింది.

ఈ భేటీలో ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్‌, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ప్రెసిడెంట్ ఖలీద్ సైఫుల్లా రహ్మానీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles