33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గోదావరి ఉగ్రరూపం…భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ!

భద్రాచలం: రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు గోదావరి ఉగ్రరూపం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరద చేరేవరకు ప్రజలు వేచి ఉండకుండా జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించి తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు.  అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూమూలకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక కోరారు.

ఈ నెల 20వ తేదీ నుంచి గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో నదిలో నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టు 25గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.గోదావరి ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో సకాలంలో వానలు కురవలేదు. దీంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. నేడు కూడా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న తెలిపారు. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వివరించారు. మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles