30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వరద తాకిడి నుంచి కోలుకుంటున్న రాష్ట్రం..సహాయక చర్యలు ముమ్మరం!

హైదరాబాద్:  గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో సంభవించిన వరదలతో అతలాకుతలమైన రాష్ట్రం ఇప్పుడిప్పుడే వరద తాకిడి నుంచి కోలుకుంటోంది.  దీంతో నిన్నటినుంచి వరద బాధిత జిల్లాలలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయిలో  ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయక పనుల్లో నిమగ్నమైంది.

వరద తాకిడికి అత్యధికంగా దెబ్బతిన్న ములుగు జిల్లాలలో నిన్న 8 మరణాలు నమోదయ్యాయి. గురువారం కొట్టుకుపోయిన నలుగురు వ్యక్తుల జాడ ఇంకా తెలియలేదు. ఎనిమిది మంది మృతి చెందినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధృవీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని,  వరద బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించామని, జిల్లా వ్యాప్తంగా 27 సహాయ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.

వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు అవసరమైన సామాగ్రిని చేరవేసేందుకు  హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. నివేదికల ప్రకారం, వరదల కారణంగా మొత్తం 20 మంది తప్పిపోయినట్లు లేదా చనిపోయినట్లు ధృవీకరించారు. గురువారం రాత్రి మూడు మృతదేహాలు లభ్యం కాగా శుక్రవారం ఎనిమిది మృతదేహాలు దొరికాయి.

ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో 80 మంది చిక్కుకుపోగా, మోరంచపల్లెలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయని, మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల పరిహారం, నష్టపోయిన వారికి తక్షణ సాయంగా రూ.25,000 అందజేస్తామని మంత్రి తెలిపారు. .

మరోవంక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 82 కాలనీలు నీట మునిగాయి. పాఖాల్, లక్నవరం, రామప్ప వంటి ప్రధాన చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గురువారం కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లలో పట్టాలు నీటమునిగి ఉండడంతో రైలు సేవలపై కూడా ప్రభావం చూపింది. అయితే గురువారం అర్థరాత్రి నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా, శుక్రవారం కూడా వరద సంబంధిత ప్రమాదాలు నమోదయ్యాయి, ఆసిఫాబాద్‌లోని తుంపెల్లి వద్ద నీటికుంటలో పడిపోయిన బాలుడిని రక్షించే ప్రయత్నంలో 35 ఏళ్ల వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇద్దరి జాడ ఇంకా తెలియలేదు.

రికార్డు స్థాయిలో వర్షపాతం, వరదలతో  గత వారం వర్షాల నష్టం ఎన్నడూ లేనంత నష్టం వాటిల్లింది.  అనేక చోట్ల అసాధారణ వరదలు గరిష్ట నష్టాన్ని కలిగించాయి. 11 చోట్ల జాతీయ రహదారులతో సహా కాలువ నెట్‌వర్క్, రోడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ దెబ్బతింది. వర్ష బీభత్సంతో వాటిల్లిన  అధికారులు ఇప్పటికే  అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా 168 చోట్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి, ఫలితంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆకస్మిక వరదల ప్రభావంతో రాష్ట్ర రహదారులు 27 చోట్ల తెగిపోయాయి. వాగులు, నదులు పొంగిపొర్డంతో 141 చోట్ల రోడ్లపై ప్రభావం చూపాయి. ముందుగా నాట్లు వేసిన వ్యవసాయ పొలాల్లో అపార నష్టం వాటిల్లింది.

మరోవైపు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కులు, నిజాం సాగర్‌కు 45,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. గురువారం వరదల బెడద నుంచి బయటపడిన కడెం ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవగా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 9.07 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.

భద్రాచలం వద్ద గత రాత్రి కాస్త తగ్గిన గోదావరి నీటిమట్టాలు శుక్రవారం పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులను దాటగా, రాత్రి 9 గంటలకు 53.1 అడుగుల నీటిమట్టం నమోదైంది.

కొత్తగూడెంలో 30 రెవెన్యూ గ్రామాలు, 45 ఆవాసాలకు చెందిన 4900 మందిని నిన్న 22 సహాయ శిబిరాలకు తరలించగా, అదేసమయంలో మంచిర్యాలలో 12 సహాయ కేంద్రాలను ప్రారంభించారు. నిజామాబాద్‌లోని 19 మండలాల్లో భారీ వర్షాలకు దాదాపు 21,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

వరదల దెబ్బకు 2787  విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 450 ట్రాన్స్‌ఫార్మర్లు, 140 సబ్‌స్టేషన్‌లు నీటమునిగిపోయాయని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) తెలిపింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ గోపాల్ రావు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles