33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వరదల్లో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 10 మంది గల్లంతయ్యారు!

హైదరాబాద్: తెలంగాణలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు సంభవించిన వరదల కారణంగా గత రెండు రోజుల్లో 17 మంది మృతి చెందగా, మరో 10 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎడతెగని వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి, 100కు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి, రోడ్డు మార్గాలు తెగిపోయాయి, విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి.

  • ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరదల్లో ఎనిమిది మంది కొట్టుకుపోయారు. వారి మృతదేహాలను శుక్రవారం వెలికితీశారు.
  • హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు చనిపోయారు. మహబూబాబాద్‌లో ఇద్దరు మృతి చెందగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకరు మృతి చెందారు.
  • వేర్వేరు ఘటనల్లో మరో పది మంది కొట్టుకుపోగా, వారి కోసం గాలిస్తున్నారు.
  • గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని, తక్షణమే రూ.25 వేలు విడుదల చేస్తామని తెలిపారు.
  • వరంగల్, హన్మకొండ పట్టణాల్లోని పలు గ్రామాలు, పదుల సంఖ్యలో కాలనీలు శుక్రవారం ముంపునకు గురయ్యాయి.
  • వరంగల్, హన్మకొండలోని  మెయిన్ రోడ్డు పూర్తిగా నీటమునిగినట్లు డ్రోన్ విజువల్స్ చూపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది మోటార్ బోట్‌లను నడిపారు.

కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయ, పునరావాస చర్యలపై కలెక్టర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం తగ్గిందని ప్రధాన కార్యదర్శి అభినందించారు.

కాగా, జిల్లా యంత్రాంగం సహాయంతో వివిధ జిల్లాల్లో సుమారు 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ తెలిపారు. పలు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు సీనియర్ పోలీసు అధికారులను పంపామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆకస్మిక వరదల ధాటికి కోతకు గురైన చెరువుల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడుతూ… రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినా, ఎన్డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా కృషి చేయడంతో నష్టం తగ్గిందని తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles