31 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో 21 రైల్వే స్టేషన్లలో అత్యాధునిక హంగులు!

హైదరాబాద్: రైల్వే శాఖ ‘అమృత్‌ భారత్‌ పథకం’ కింద దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా తెలంగాణ నుంచి మెుదటి విడతలో 21 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. వీటిని రూ. 891 కోట్లతో అత్యాధునిక హంగులు సమకూర్చనున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని  మోదీ మాట్లాడుతూ… ప్రతి అమృత్‌ భారత్‌ స్టేషన్‌ ఆ ప్రాంత  పురాతన వారసత్వానికి, ఆధునిక ఆకాంక్షలకు ఒక చిహ్నంగా మారుతుందన్నారు. ఈ స్టేషన్లలో స్థానిక ప్రత్యేకతలను ప్రతిబింబించేలా రెండు ప్రధాన ద్వారాలు, లిఫ్ట్‌లు, ఎక్సకవేటర్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్థానిక కళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు స్టేషన్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అమృత్‌ భారత్‌ సేషన్ల పథకంలో తెలంగాణ రాష్ట్రంలో 39 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. మొదటి దశలో 21 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. వాటిలో ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, హఫీజ్‌పేట్‌, హైటెక్‌ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌ (నాంపల్లి), జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, కాజీపేట జంక్షన్‌, ఖమ్మం, మధిర, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మలక్‌పేట, మల్కాజ్‌గిరి, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి, జహీరాబాద్‌ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

మోడ్రనైజేషన్‌లో భాగంగా స్టేషన్ల లోపల, పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, మొక్కలు పెంచడం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వైఫై సదుపాయాలతో పాటు వన్‌ స్టేషన్‌- వన్‌ప్రొడక్ట్‌ దుకాణాలు, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో చిన్న గార్డెన్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు.

అవసరాలకు అనుగుణంగా బిజినెస్‌ సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్‌ రోడ్లు, రూఫ్‌ ప్లాజాలు దీర్ఘకాలంలో అవసరమయ్యే ఇతర వసతులను కూడా చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ… రైల్వే అభివృద్ధి దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధే. రైల్వేలు రోగులకు, విద్యార్థులకు, మధ్యతరగతి వ్యాపారులకు సహాయకారిగా ఉంటాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం రాష్ట్ర అభివృద్ధి, సాధారణ ప్రజలకు విలువైనదిగా ఉంటుంది. రైల్వే ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇతర రవాణా మార్గాల కంటే రైలులో ప్రయాణించడాన్ని తాను ఎప్పుడూ ఇష్టపడతానని కూడా గవర్నర్ వివరించారు.

కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… “అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రూ. 309 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌ దక్కన్‌ రైల్వే స్టేషన్‌గా పిలుచుకునే నాంపల్లి రైల్వే స్టేషన్‌ను రీ డెవలప్‌ చేస్తున్నామని, కాచిగూడ రైల్వే స్టేషన్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రోడ్డు, రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, పట్టణ, గ్రామీణ కనెక్టివిటీ అభివృద్ధికి రోల్ మోడల్‌గా ఉండే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రాంతీయ రింగ్ రోడ్‌తో పాటు రింగ్ రోడ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles