23.7 C
Hyderabad
Monday, September 30, 2024

పాఠశాలల పర్యవేక్షణకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్!

హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల పర్యవేక్షణకు ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ఈ అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ద్వారా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, హాజరు నుండి అకడమిక్ పనితీరు వరకు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్కూళ్ల పర్యవేక్షణతో పాటు ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించిన మొత్తం సమాచారం కేవలం ఒక క్లిక్‌లో ఉండేలా  పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

‘విద్యా సమీక్షా కేంద్రం’ పేరుతో, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నమోదు, వారి అభ్యాస స్థాయిలు, వ్యక్తిగతంగా విద్యార్థులు  సాధించిన విజయాలను ట్రాక్ చేయడానికి ఈ కేంద్రం ఉపయోగ పడనుంది.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆరోగ్య శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో ఈ కొత్త కేంద్రం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లోని రెండవ అంతస్తులో రాబోతోంది. అత్యాధునిక కంప్యూటర్ సిస్టమ్‌లతో పాటు 20 అడుగుల భారీ స్క్రీన్‌తో కూడిన ఈ కేంద్రం సమాచారాన్ని స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో  పిల్లల సమాచారం, అభ్యాస ఫలితాలు, మధ్యాహ్న భోజన వినియోగంతో సహా వివిధ అప్లికేషన్‌లను కమాండ్ కంట్రోల్ కేంద్రంలో  విలీనం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఉపయోగించి, పాఠశాలలను పర్యవేక్షించడానికి కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తారు. తద్వార మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, విద్యార్థులకు యూనిఫాం పంపిణీతో సహా అన్ని పథకాల పర్యవేక్షణ చేయడంతో పాటు వీటిని  ట్రాకింగ్ చేసేందుకు ఈ సెంటర్ అధికారులకు ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం, అధికారులు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లేదా UDISE డేటాబేస్‌లో సమాచారం సేకరిస్తున్నారు. అయితే UDISE ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది గజిబిజి,  సమయం తీసుకునే ప్రక్రియ. ఆధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని డ్యాష్‌బోర్డ్‌లో ఒక బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా అన్ని పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండటంతో, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రం అధికారులకు సహాయం చేస్తుంది.

అంతేకాదు పాఠశాలల్లో హాజరు తీసుకోవడానికి ఈ వారం ప్రారంభించనున్న ముఖ గుర్తింపు హాజరు ఆధారిత అప్లికేషన్ కూడా కేంద్రానికి అనుసంధానించనున్నారు. దీని వలన అధికారులు రియల్‌టైంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత హాజరును ట్రాక్ చేయవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా, అవసరమైతే వారి పనితీరు, అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ కొత్త కేంద్రం అధికారులకు సహాయం చేస్తుంది. రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు సీసీటీవీ కెమెరాలను కేంద్రానికి అనుసంధానం చేయడంతో వీడియో నిఘాలో ఉంటాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles