23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రభుత్వ స్కూళ్లలో త్వరలోనే ‘ఫేస్‌ రికగ్నైజేషన్ సిస్టం’ ఏర్పాటు!

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’ త్వరలోనే అమల్లోకి రానుంది. విద్యార్థుల హాజరు నమోదుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. దీంతో సర్కారు బడుల్లో మాన్యువల్ హాజరు విధానం త్వరలో అదృశ్యమవుతుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. డీఎస్‌సీఎఫ్‌ఆర్‌సీ పేరిట ఈ యాప్‌ను వినియోగంలోకి తేనున్నారు. ఈ యాప్‌లో ఒకసారి విద్యార్థుల కన్ను, కనురెప్ప, ముక్కు వంటి 70 ఫేషియల్ పాయింట్లను నమోదు చేస్తారు.

సెప్టెంబర్ చివరి వారంలోగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని విద్యాశాఖ యోచిస్తోంది. సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. “పాఠశాల విద్యా వ్యవస్థలో విద్యార్థులు, విద్యావేత్తలు, సిబ్బంది నిర్వహణ కీలకమైన భాగాలు అని మనందరికీ తెలుసు కాబట్టి, విద్యా శాఖ అత్యాధునిక సాంకేతిక పురోగతిని అనుసరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రక్రియల అవసరాలు – సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేయడానికి డిపార్ట్‌మెంట్ ఏజెన్సీ M/s, RNIT సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుందని” ఆయన అన్నారు.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’ను ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు సహా 26,000 పాఠశాలల్లో చదువుతున్న 26 లక్షల మంది విద్యార్థులకు ఈ కొత్త విధానం అమలు చేయనున్నారు. “మొదట్లో, డిపార్ట్‌మెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేస్తారు. తరువాత ఇది ఉపాధ్యాయులకు విస్తరించనున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే ఈ యాప్‌ ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు విధానాన్ని మరింత ఆధునికీకరించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా అమలు..
ఇప్పటికే మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో అమలు చేశారు. పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 26 లక్షల మంది విద్యార్థులు, 1.10 లక్షల మంది ఉపాధ్యాయుల హాజరు కోసం రెండు నెలల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.  తాజాగా 20 వేల ట్యాబ్‌లు కూడా ఇచ్చినందున అందులో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని హాజరు నమోదు చేయవచ్చని చెబుతోంది.

కృత్రిమ మేధ అల్గారిథమ్‌తో పనిచేసే ఈ యాప్‌తో ఒకసారి విద్యార్థుల ముఖంలోని కన్ను, కనురెప్ప, ముక్కు ఇలా 70 వరకు ఫేసియల్‌ పాయింట్లను గుర్తిస్తుంది. హెచ్‌ఎం లేదా ఉపాధ్యాయుడి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ ఓపెన్‌ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపితే చాలు హాజరు నమోదవుతుంది. ఒకేసారి 15 – 20 మంది హాజరు తీసుకోవచ్చు. విద్యార్థులు ఆ ఫోన్‌ ముందు నుంచి వెళ్తుండగానే హాజరు తీసుకుంటుంది. ఒకటో తరగతిలో ఒకసారి ఫేసియల్‌ పాయింట్లు తీసుకుంటే డిగ్రీ వరకు పనిచేస్తుంది. పిల్లలు పెద్ద వారయినా, ముఖ కవళికలు మారినా, ఆ యాప్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకూ ఈ విధానాలే వర్తిస్తాయి. ‘యాప్‌లో విద్యార్థుల ముఖాన్ని ఫొటో తీయడం, నిల్వ చేయడం ఉండదు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. డేటా కూడా కేవలం ప్రభుత్వ సర్వర్లలోనే స్టోర్‌ అవుతుంది’ అని విద్యాశాఖ వర్గాలు చెప్పాయి. ఈ యాప్‌ కేవలం పాఠశాలల్లో మాత్రమే పనిచేస్తుంది. వారం వారీగా హాజరు శాతం నివేదికలు పొందొచ్చు. మధ్యాహ్న భోజన హాజరుకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles