24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మూసీ ప్రాజెక్టుకు సాయపడేందుకు అంగీకరించిన ప్రపంచ బ్యాంకు!

హైదరాబాద్: రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమయ్యారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, స్కిల్ యూనివర్శిటీ, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 అభివృద్ధిని చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది.

ప్రపంచ బ్యాంకు అధిపతి,ముఖ్యమంత్రి మధ్య గంటకు పైగా జరిగిన సమావేశంలో ప్రతి ఆచరణీయ ప్రాజెక్టులను ఆచరణలోకి తేవడానికి క్రాస్-ఫంక్షనల్ బృందాన్ని రూపొందించాలని నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్‌​మెంట్​, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తో పాటు వివిధ అంశాలపై చర్చించారు.

అంతేకాదు ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఏర్పాటు చేయాలనే ఆలోచనలను ప్రపంచబ్యాంకు బృందంతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తిని ప్రదర్శించింది. ప్రజా పాలనతో పాటు రాష్ట్రంలో సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చర్చల్లో పాలుపంచుకున్న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు.

ఈ సమావేశంలో ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, జయేష్ రంజన్, రామకృష్ణారావు, వి శేషాద్రి, విష్ణు వర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles