23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

కండ్లకోయలో ‘గేట్‌ వే’ ఐటీ పార్కు నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన!

హైదరాబాద్: నగరంలో 1998 సంవత్సరం ‘సైబర్ టవర్ల‘ నిర్మాణంతో హైదరాబాద్ పశ్చిమ భాగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల హబ్‌గా అభివృద్ధి చెందింది. నగరంలోనే అతిపెద్ద ఐటీ టవర్ ‘గేట్‌వే’  నిర్మాణంతో ఐటీ హబ్‌ను హైదరాబాద్  నగర ఉత్తర భాగానికి విస్తరించడం త్వరలో  ప్రారంభమవుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని కండ్లకోయ గ్రామంలో ఐటీ పార్క్ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణం కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా  రెండేళ్ల ఆలస్యం తర్వాత, తెలంగాణ ప్రభుత్వం నగరంలో ఎత్తైన ఐటీ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు గురువారం  శంకుస్థాపన చేశారు. పద్నాలుగు అంతస్తుల ఐటీ పార్కును తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) నిర్మించనుంది. 100 కోట్ల వ్యయంతో సుమారు 10 ఎకరాల స్థలంలో ఆరు లక్షల అడుగుల పైగా ఆఫీస్ స్పేస్ కలిగి, 100 కంటే ఎక్కువ కంపెనీలకు  ఈ ఐటీ పార్క్ వసతి కల్పిస్తుంది. అంతేకాదు IT రంగంలో 50,000 ఉద్యోగాలను సృష్టించగలదని భావిస్తున్నారు. గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (GRID) విధానంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం నగరం యొక్క ఉత్తర, తూర్పు దిశలలో IT మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కొత్త ఐటీ పార్క్‌లో ఆఫీస్ స్పేస్ కోసం 100 కంపెనీల్లో దాదాపు 70 కంపెనీలు బుక్ చేసుకున్నాయని కొంపల్లి ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ (కైటీఈఏ) అధ్యక్షుడు, లాస్య ఐటీ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓరుగంటి వెంకట్ తెలిపారు.
‘గేట్‌వే ఐటీ పార్క్‘కు శంకుస్థాపన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో హైదరాబాద్‌లో ఐటీ విస్తరణ గురించి అనేక అనుమానాలు ఉండేవి. కొత్త ఐటీ కంపెనీలు వచ్చే సంగతేమో కానీ ఉన్న ఐటీ కంపెనీలు పోతాయేమోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసినం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి సమర్థ నాయకత్వంలో టీఎస్‌ఐపాస్‌ వంటి ఫ్రెండ్లీ పాలసీలతో వందల కంపెనీలను ఇక్కడికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించాం. ఐటీలో తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్న తపనలో భాగంగానే ఈ రోజు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన యాపిల్‌, గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అతి పెద్ద సంస్థలు తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే నిర్మించాయి. 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఇక్కడే ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న పాలసీలు దేశానికే ఓ బెంచ్‌మార్క్‌గా నిలుస్తున్నందున నగరానికి రోజుకో కంపెనీ వచ్చి పెట్టుబడి పెడుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు మహా అయితే నాలుగైదు లక్షలు ఉంటాయి. కానీ ఏటా వచ్చే లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోగలిగేలా నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ఈ నెల 13నే ఉప్పల్‌ ప్రాంతంలో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెన్‌ప్యాక్ట్‌ ఐటీ కంపెనీకి శంకుస్థాపన చేశాం. దాని ద్వారా 15వేల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్‌లన్నీ హైదరాబాద్‌లో ఉన్న జీనోమ్‌ వ్యాలీలోనే తయారవుతున్నాయి. ఆ ఐటీ, వ్యాక్సిన్‌ కంపెనీల్లో మన పిల్లలకూ ఉద్యోగాలు రావాలంటే ఆ మేరకు ఎప్పటికప్పుడు స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. ఉద్యోగాలు చేయడం మాత్రమే కాదు మీరే పది మందికి ఉద్యోగం ఇచ్చేలా ఎదగండి. ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగాలనుకున్న ఔత్సాహికులకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ ద్వారా అవకాశం కల్పిస్తున్నది. అవసరమైతే కొంపల్లిలో కూడా మరో టీ హబ్‌ను నిర్మిస్తాం అని ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles