24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

కుల, మత రాజకీయాలు క్యాన్సర్‌ లాంటివి… సీఎం కేసీఆర్‌!

హైదరాబాద్: మతం, కులం పేరిట కొంతమంది చిల్లర రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. దీనివల్ల సామరస్య వాతావరణం చెడిపోయి, మతమనే క్యాన్సర్‌ జబ్బు పట్టుకుంటే ప్రమాదంలో పడిపోతామని ఆయన హెచ్చరించారు. అన్ని కులాలను మతాలను హైదరాబాద్‌ ఆదరిస్తోందని, అటువంటి దాన్ని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు మంగళవారం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.   ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘తెలంగాణలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు మతం పేరు మీద.. కులం పేరు మీద.. చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఫలానా వాళ్ల షాప్‌లో పూలు కొనొద్దు.. ఫలానా వాళ్ల షాప్‌లో అది కొనొద్దు.. ఇది కొనొద్దు.. అని మాట్లాడుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ఏం జరగుతుందో.. విజ్ఞత ఉన్న మీరే ఆలోచించాలి. ఎందుకంటే మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ దరిద్రపు చర్యలతో ఒకవేళ వాళ్లందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్లకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి.. ఎవరు పోషించాలి’ అని సీఎం ప్రశ్నించారు.

తెలంగాణ, అందునా హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో దేశ విదేశాలకు చెందిన వారు స్థానికంగా ఫ్యాక్టరీలు పెడుతున్నారు. అదే శాంతి, భద్రతలు లేకుంటే పెట్టుబడులు పెట్టేందుకు వస్తారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కుల, మతాల పేరిట సంకుచిత ధోరణలకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఇప్పటికే తెలంగాణ పలు రాష్ట్రాలను అధిగమించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వికలాంగులకు రూ.3,016, అడపిల్లల పెండ్లికి రూ.1,00,116 సాయమందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, సమగ్ర అభివృద్ధిపై ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్న సీఎం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రాథమిక సౌకర్యాలను ఎలా కల్పించిందో కూడా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టించిన గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో కరెంటు లేకపోవడంతో రైతులు రోడ్డెక్కిన తరుణంలో తెలంగాణలో అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగోందని సీఎం పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles