33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

సీసీఐ ఆస్తుల వేలానికి సిద్ధమైన కేంద్రం… పునరుద్ధరణకు తెలంగాణ విజ్ఞప్తి!

హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణ ఆశలు  గల్లంతయ్యాయి. దశాబ్ధాల కిందట ఖాయిలాపడిన పరిశ్రమను పునరుద్దరించే ప్రయత్నం జరుగొచ్చని ఆశిస్తున్న తరుణంలో యంత్ర సామగ్రినంతా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీసీఐ ఆదిలాబాద్‌ పరిశ్రమలోఈ-వేలం ఏ మాత్రం సహేతుకం కాదని, దీనిని పునరుద్ధరించాలని నేడు మంత్రి కేటీ రామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సీసీఐ సామాగ్రిని వేలం వేయడానికి భారత ప్రభుత్వం టెండర్లను పిలిచిందనే నివేదికలపై స్పందిస్తూ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, భారత ప్రభుత్వం తక్షణమే దీన్ని సమీక్షించి, పునరుద్ధరణకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లోని వేలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని, ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చారు. 2008లో మూతపడిన ఈ యూనిట్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గతంలో పలుమార్లు కేంద్రానికి విన్నవించారు.
రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ సీసీఐ యూనిట్‌లోని యంత్రసామగ్రి, ఇతర నిల్వలతో పాటు తుక్కు, టౌన్‌షిప్‌లలోని క్వార్టర్లను కూలగొట్టి దాని సామగ్రిని తీసుకెళ్లడం, సీసీఐ భూములు, భవనాల ఆస్తుల విలువ అంచనావేయడం (వాల్యుయేషన్‌) వంటి అంశాలతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ-టెండర్లను పిలిచింది. ఈ నెల అయిదో తేదీ నుంచి టెండర్లను స్వీకరిస్తోంది. దాఖలుకు 23 వరకు గడువు విధించింది. అదే రోజు టెండర్లను తెరుస్తామని.. ఖరారైన 120 రోజుల్లో మొత్తం బిడ్డింగు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది.
కేంద్రం పిలిచిన తాజా టెండర్లను అనుసరించి ఇది అమ్మకం ప్రక్రియను ఆరంభించినట్లుగా కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. యంత్రసామగ్రి, సిబ్బంది క్వార్టర్లను కూల్చివేయడం, ఆస్తుల విలువలను మదించడం వంటివి ఇందుకోసమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సంస్థ ప్రైవేటీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రస్తుతం యూనిట్‌ పునరుద్ధరణకు చాలా అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు ఉన్నాయని, యూనిట్‌ను తిరిగి తెరవాలని జనవరిలో కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. యూనిట్ కోసం 772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్ రాశారు. సీసీఐ టౌన్‌షిప్ కోసం అదనంగా 170 ఎకరాలు, 48 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాల కోసం 1,500 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
సీసీఐ సిమెంట్ యూనిట్‌కు సరిపడా నీరు, 2 కేవీ విద్యుత్ సరఫరా కూడా ఎళ్లవేళలా అందుబాటులో ఉందని, సీసీఐని పునఃప్రారంభించడం వల్ల తెలంగాణకే కాకుండా మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా సాయం అందుతుందని కేటీఆర్ అన్నారు. సీసీఐని పునఃప్రారంభించడం వల్ల ఆదిలాబాద్‌ పెద్దఎత్తున అభివృద్ధి అవుతుందని, ప్రధానంగా స్థానిక యువతకు కొత్త ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ నిర్మాణ రంగం బూమ్, సిమెంట్ కంపెనీలు లాభాలను ఆర్జించడంతో, యూనిట్ తిరిగి తెరవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే హఠాత్తుగా సీసీఐ యంత్ర సామగ్రినంతా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం రాష్ట్రప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడటం లేదు.
1984లో ఆదిలాబాద్‌లో రూ.47 కోట్ల పెట్టుబడితో 772 ఎకరాల్లో సీసీఐ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సీసీఐ టౌన్‌షిప్‌ను కూడా 170 ఎకరాల్లో 400 క్వార్టర్లతో నిర్మించారు. నష్టాల కారణంగా 2008లో యూనిట్‌ను మాసేశారు. దీంతో 5,000 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, గిరిజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో స్థానికులకు ఉపాధి లభిస్తుందని, యూనిట్‌ను తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles