30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల సత్తా…. ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు!

మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. నాలుగేళ్ల కిందట సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా అప్‌గ్రేడ్‌ అయిన బెల్లంపల్లిలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ బాయ్స్ రెసిడెన్షియల్‌ స్కూల్‌  ప్రతిభ గల విద్యార్థులను తయారు చేయడంలో మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ స్కూల్లోని విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తిపరమైన కోర్సులను అందించే దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు పొందటం విశేషం.

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన  విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (NIT), కేంద్రం నిధులతో నడిచే అత్యున్నత సాంకేతిక సంస్థలలో సీట్లు పొందగలిగారు. సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఇనాల సైదులు ఏడేళ్లుగా విద్యార్థులకు అండదంగా ఉంటూ వారిని జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు పొందేలా అహర్నిశలు కృషి చేస్తున్నారు.

ఈ కేంద్రంలోని గిరిజన విద్యార్థి… వేమనపల్లిలోని అంతర్గత నాగారం గ్రామానికి చెందిన నైతం రాజేష్ 2020లో ఐఐటీ -వారణాసిలో అడ్మిషన్ సాధించగా, మరో ఆరుగురు విద్యార్థులు గత మూడేళ్లలో NIT లలో అడ్మిషన్లు సాధించారు. ప్రిన్సిపాల్‌ అందించిన సమాచారం మేరకు బెజ్జూరు మండలం సులుగుపల్లికి చెందిన బోర్కుటి అనిల్‌, బెల్లంపల్లిలోని బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన కోనూరి ఉమేష్‌చంద్ర అనే ఇద్దరు విద్యార్థులు ఈ సంస్థ నుంచి ఉత్తీర్ణులై 2020లో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మెడిసిన్‌ సీట్లు పొందారు.

అదేవిధంగా, సంస్థలోని ముగ్గురు విద్యార్థులు 2021లో రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకునే అవకాశాన్ని పొందారు. ఈ కేంద్రంలోని మరో ముగ్గురు పూర్వ విద్యార్థులు 2021లో ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు పొందగలిగారు. గత ఏడాది నలుగురు విద్యార్థులు కేరళలోని కొచ్చికి చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ ద  ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ (CIFNET) లో సీట్లు సాధించడం విశేషం.

కేరళలోని కోవలంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థలో  ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు, ఇద్దరు విద్యార్థులను బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం షార్ట్‌లిస్ట్ చేసింది. ఇప్పటివరకు నలుగురు విద్యార్థులు రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో సీట్లు పొందారు. మరొకరు కేరళ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందారు.

బెల్లంపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్స్‌పల్‌ సైదులు మీడియాతో మాట్లాడుతూ… విద్యార్థులను అన్ని విధాల తీర్చిదిద్దేందుకు మేము వివిధ వినూత్న బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాము. పాఠాలను అర్థం చేసుకోలేని వారిపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా వారిని మెరుగుపరుస్తాము. మేము వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి, వారి తల్లిదండ్రులను మోటివేట్‌ చేసేందుకు విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తాము. ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలు చేయడానికి మేము వారిని సిద్ధం చేస్తాము. ఫలితంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు చదువులో రాణించగలుగుతున్నారు’’ అని ఆయన అన్నారు.

2016-17 సంవత్సరానికి గానూ బెల్లంపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌  జాతీయ స్వచ్ఛ్ పురస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ నుంచి ఎంపికైన 14 విద్యాసంస్థల్లో ఇది ఒకటిగా అవార్డుకు ఎంపికైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూ.50 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 2017లో తెలంగాణకు హరితహారం సమర్థవంతంగా అమలు చేసినందుకు గానూ ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హరిత మిత్ర అవార్డును అందజేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles