28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ఓడీఎఫ్‌ ప్లస్‌’లో తెలంగాణే టాప్‌.. అట్టడుగు స్థానంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు!

హైదరాబాద్: పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌-ప్లస్‌) గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ, స్వచ్ఛ భారత్‌ కింద బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌)తోపాటు గ్రామాలకు ర్యాంకింగ్‌ల విషయంలోనూ గొప్ప పనితీరు కనబరిచింది. మే 17 నాటికి 99.98 శాతం స్కోర్‌తో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

అయితే నిత్యం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ పాట పాడే బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రామాలు కేవలం 4.54 శాతం మాత్రమే ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొందాయి. అక్కడ గత ఐదున్నర సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతున్నది. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కేవలం 19.36శాతం గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొందాయి. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం ద్వారా గ్రోత్‌ డబుల్‌ అవుతుందని బీజేపీ నేతలు వినిపిస్తూ వస్తున్నారు. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఎన్నికల నినాదమే తప్ప వాస్తవంలో దాని డొల్లతనమెంతో ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల సంఖ్య ద్వారా స్పష్టమైంది.

తెలంగాణలో, రాష్ట్రంలోని 12,769 గ్రామాలలో 12,766 ODF ప్లస్ జాబితాలో ఉన్నాయి, ఇంకా మూడు గ్రామాలు మాత్రమే జాబితాలో చేరలేదు! ODF ప్లస్‌గా ప్రకటించిన 11,569 గ్రామాలతో (92.37%) తమిళనాడు రెండవ స్థానంలో ఉంది.

కేంద్రం సహకరించకపోయినా…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఏ మాత్రం సహకరించుకున్నా రాష్ట్రంలోని పల్లెలు అనేక అంశాల్లో ముందు నిలుస్తున్నాయి. రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేసినా, నిబంధనల ప్రకారం రావాల్సిన నిధుల కంటే ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వకున్నా.. ఓడీఎఫ్‌ ప్లస్‌, ఆన్‌లైన్‌ అడిట్‌, సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన, ఈ- పంచాయత్‌, ఆదర్శ గ్రామాల అవార్డులను దక్కించుకున్నాయి.

పల్లె ప్రగతి, దేశంలోనే మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వం రూపొందించని ఒక రకమైన కార్యక్రమం. పల్లె ప్రగతి కార్యక్రమం కింద పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పలు పనులు చేపడుతున్నారు.  ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను ప్రభుత్వం సమకూర్చింది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునే విధంగా చేయడమే కాకుండావాటిని వినియోగించుకునే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకువచ్చింది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌ షెడ్‌ను నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 డంపింగ్‌ యార్డులను ప్రభుత్వం నిర్మించింది. ప్రతిరోజు ట్రాక్టర్‌ ద్వారా ఇంటింటి చెత్తను సేకరిస్తున్నారు. ఘన వ్యర్థాలను విక్రయిస్తుండగా, తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగతంగా ఇంకుడు గుంతలను నిర్మించారు.

ఓడీఎఫ్ రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచినందుకు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

13,737 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్
తెలంగాణలో 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలను అంటే 96.74 శాతం ఓడీఎఫ్‌(ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) ప్లస్‌గా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కల్పించిన వసతులు, మౌలిక సదుపాయాలతో తెలంగాణ పల్లెలు దేశంలో అగ్రగామిగా ఉన్నాయి. ఇటీవల ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌గా నిలిచాయని పంచాయతీరాజ్ అధికారులు వెల్లడించారు. దేశంలో మొత్తం 5,82,903 గ్రామాలుంటే 26,138 గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్‌ ప్లస్‌ పరిధిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో తెలంగాణ గ్రామాలు 13,737 (52శాతం) ఉన్నాయి.

ఓడీఎఫ్ అంటే…
గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఓడీఎఫ్‌(బహిరంగ మల విసర్జన రహిత)గా గుర్తిస్తారు. ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం, చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడి పొడి చెత్తగా వేరు చేయడం, ప్రతి గ్రామానికి చెత్తను సేకరించడానికి ట్రాక్టర్‌ ఉండడం, శ్మశాన వాటికను నిర్మించడం, ఇంకుడు గుంతలు, రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles