28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ప్రగతి పథంలో తెలంగాణ… 8ఏళ్ల ప్రస్థానంపై ప్రభుత్వ నివేదిక!

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యానవనాలు, పరిశ్రమలు, పర్యాటకం ఇలా అన్ని రంగాల్లో ఎలా రాణించిందో  ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.

అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పోల్చిచూడనుంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 2న (గురువారం) హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దాదాపు 40 నిమిషాల ప్రసంగంలో జాతీయ, అంతర్జాతీయంగా పెట్టుబడులను  ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు.

పరిశ్రమలు, ఐటీలో మేటి!
ఎనిమిదేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాలు పరుగులు తీశాయి. ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు గమ్యస్థానంగా నిలిచింది. అంకుర సంస్థల వేదికలైన టీహబ్‌, వీహబ్‌ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పేరెన్నికగన్న కంపెనీలైన యాపిల్‌, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తృతపరిచాయి. సేల్స్‌ఫోర్స్‌, ఉబర్‌, మైక్రాన్‌, స్టేట్‌ స్ట్రీట్‌, ఫియట్‌ క్రిజ్లర్‌, మాస్‌, ఇంటెల్‌, ప్రావిడెన్స్‌, యూబీఎస్‌, ఎంఫసిస్‌, పెప్సీ, లిగాటో, ఎఫ్‌5లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం- నాస్కామ్‌ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌హబ్‌గా హైదరాబాద్‌ నిలిచింది. నాస్కామ్‌ అంచనాల ప్రకారం జాతీయస్థాయిలో 2020-21 సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య 1.38 లక్షలు. దీని ప్రకారం.. ఐటీ రంగంలో జాతీయస్థాయిలో 33 శాతం ఉపాధి కల్పనకు తెలంగాణ భాగస్వామ్యాన్ని అందించింది. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులను సమీకరిస్తున్నారు.

రైతు బంధు
రైతుబంధు గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. ఇక్కడ రైతులకు సీజన్‌కు ఎకరాకు రూ. 5,000 మద్దతు అందిస్తున్నారు. అంతేకాదు 81,990 అటవీ హక్కుల రైతులకు గుర్తింపు ఇచ్చారు. 2021-22 నుంచి ఎకరాకు సీజన్‌కు రూ. 5000. రైతు భీమా పథకం రైతులకు ఎలా ఉపయోగపడిందో, రైతుల ఆత్మహత్యలను దాదాపు సున్నాకి తగ్గించడంలో ఎలా దోహదపడిందో కూడా ఆయన వివరిస్తారు.

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం..
వైద్య, ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది. హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించి.. వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు, ప్రసవానంతరం ఇంటికి చేర్చేందుకు 300 అమ్మఒడి వాహనాలు సేవలందిస్తున్నాయి. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, శిశువులకు ప్రతిరోజూ పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారం అందుతోంది. మాతా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 12 వేలు, ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రూ. 13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. 2017లో ప్రారంభించిన కార్యక్రమం సంస్థాగత ప్రసవాల పెరుగుదలకు దారితీసింది. మాతాశిశు మరణాల రేటును తగ్గించింది

అయితే రెండు బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌లో 167 మంది, మధ్యప్రదేశ్‌లో 163 ​​మంది మరణించగా, తెలంగాణలో టియో (ఎంఎంఆర్) 56కి చేరుకుంది. అదేవిధంగా, శిశు మరణాల నిష్పత్తిలో, తెలంగాణ రాష్ట్రం 23 వద్ద ఉండగా, యూపీ 41,   మధ్యప్రదేశ్ సగటు 46గా ఉంది.

రాష్ట్రం సస్యశ్యామలం
నీటిపారుదల రంగంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతి పెద్దదైన కాళేశ్వరం బహుళ దశల భారీ ఎత్తిపోతలను ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, దేవాదుల తదితర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. ఒకప్పటి కరవు జిల్లా పాలమూరు పచ్చలహారంగా మారింది. నాగార్జున సాగర్‌, శ్రీరామ సాగర్‌, నిజాం సాగర్‌ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. మిషన్‌ కాకతీయతో 46,531 చెరువులను పునరుద్ధరించగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. చేపల పెంపకం ఊపందుకుంది. జీవవైవిధ్యం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు, వంకల పునరుజ్జీవం కోసం రూ. 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణం జరుగుతోంది. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం రూ.1.52 లక్షల కోట్లు వెచ్చించి.. సాగునీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచింది.

విద్యుత్‌ వెలుగులు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించింది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గృహ వినియోగ రంగాలకు నిరంతర విద్యుత్‌ అందుతోంది. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా వాటి రూపురేఖలు మారాయి. రహదారి వ్యవస్థ మెరుగుపడింది. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయి. పర్యాటక రంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోంది.

సంక్షేమానికి ప్రాధాన్యం
ఆసరా పథకం కింద 38 లక్షల మందికి పింఛన్లు అందిస్తోంది. 11.44 లక్షల మంది పేద వధువులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సాయం చేస్తోంది. ఆత్మగౌరవంతో జీవించేందుకు 2.81 లక్షల రెండు పడకగదుల ఇళ్లు నిర్మిస్తోంది. తెల్లరేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం పంపిణీ, 7.3 లక్షల మంది గొల్ల, కురుమలకు యూనిట్ల పంపిణీ, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారులు, గీత, చేనేత, రజక, నాయీ బ్రాహ్మణులు, అర్చకులు, ఇమాం, మౌజన్‌లకు ప్రభుత్వ వేతనాలు, కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ, ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పథకాలు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

మొత్తంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.పెట్టుబడులు ఆకర్షిస్తూ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం సహా.. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ముందుకెళ్తున్నట్లు నివేదించింది. ఆదర్శవంతమైన పల్లెలుగా తీర్చిదిద్దుతూ.. దేశానికే నమూనాగా రూపొందించినట్లు పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles