28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

విశ్వనగరం దిశగా హైదరాబాద్… 8ఏళ్లలో అద్భుతమైన ప్రగతి!

హైదరాబాద్: జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అంటూ… ఎనివిదవ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ… రాజధాని నగరం హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశంలోని మెట్రో నగరాలను దాటి విశ్వనగరం దిశగా శరవేగంతో అడుగులు వేస్తోంది. ‘ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో హైదరాబాద్‌ సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తాయి.  అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతమైంది.  నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నగర రూపురేఖల్లో వచ్చిన మార్పులపై ఓ కథనం..

ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో దేశానికే దిశానిర్దేశం చేసేలా హైదరాబాద్ నగరం ప్రపంచముందు సగర్వంగా నిలిచింది. మౌలిక సదుపాయాల పరంగా నగరం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వారసత్వపు సొబుగులకు ఏమాత్రం ఆటంకం లేకుండా కొత్త అందాలతో మెరిసిపోతోంది. ఒకప్పుడు ఇరుకైన రహదారులతో ఉన్న నగరంలో నేడు విశాలమైన రోడ్డు మార్గాలతో ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఉంది. అంతేకాదు రాకపోకలు సాఫీగా సాగేందుకు ఫ్లైఓవర్‌లు, డాట్ కీ జంక్షన్‌లు, వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గమ్యస్థానాలను త్వరగా చేరేందుకు అండర్‌పాస్‌లు సాయపడుతున్నాయి. ఇక పుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు (FoBs) పాదచారులకు హైటెక్ అనుభూతిని అందిస్తున్నాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన ప్రణాళికలో గతంలో కంటే ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక అభివృద్ధి అనే త్రిముఖ విధానాన్ని అవలంబించడం. అందువల్ల వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (SRDP), లింక్ రోడ్లు, వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (SNDP) వంటి ప్రాజెక్టులు నగర పౌరులకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తూ, రాబోయే రోజుల్లో కావాల్సిన అవసరాలు, డిమాండ్లను తీర్చడానికి వీటిని ఉద్దేశించారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యం కోసం మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్లు, ప్రత్యేక రవాణా కారిడార్ల ఏర్పాటు. మరికొన్నింటికీ ప్రణాళికలు రచించారు. అభివృద్ధిని చూసి దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడుల కోసం రాజధానికి వరుస కట్టాయి. ఫార్మా, రియల్‌ ఎస్టేట్‌కు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. విశ్వనగరం దిశగా దూసుకుపోతున్న హైదరాబాద్‌ స్టార్టప్‌లకు వేదికగా నిలిచింది. టీహబ్‌ వేదికగా వందలాది స్టార్టప్‌లు ప్రారంభం ఆయ్యాయి.

మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో, ఎస్‌ఆర్‌డీపీ (SRDP) కింద, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (RoBs), రోడ్ అండర్ బ్రిడ్జెస్ (RuBs)తో సహా మొత్తం 29 ప్రాజెక్టులు గత ఎనిమిది సంవత్సరాలలో పూర్తిచేశారు. సుమారు రూ. 37,000 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 70 ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో రూ. 8,052 కోట్లతో 47 ప్రాజెక్టులు మొదటి దశలో ఉన్నాయి. హైదరాబాద్‌ను నగరం యొక్క వారసత్వ సంపదను సక్రమంగా పరిరక్షిస్తూ ఈ బృహత్తర అభివృద్ధిని చేపట్టడం జరిగింది. నివసించడానికి, పెట్టుబడి పెట్టడానికి ప్రపంచంలోని ఉత్తమ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు.

కేవలం రహదారి నెట్‌వర్క్‌లే కాదు, నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారకుండా నిరోధించడానికి హరితహారం పథకం ద్వారా పట్టణ అటవీ బ్లాక్‌లు హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్నాయి. 82.94 ఎకరాలలో 19 థీమ్ పార్కులను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేసింది. వివిధ ప్రదేశాలలో మరో 53 సౌకర్యాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ వీధులు రాత్రిళ్లు కాంతులీసుతున్నాయి. సంప్రదాయ వీధిలైట్ల స్థానంలో 4.92 లక్షల ఎల్‌ఈడీ బల్బులు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయడం వల్ల నెలవారీ విద్యుత్ బిల్లు వ్యయం రూ.6 కోట్లకు పైగా తగ్గింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కూడా ఈ ప్రయత్నంలో పాలుపంచుకోనుంది. 158-కిమీ ఔటర్ రింగ్ రోడ్ (ORR)ని ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది.

ఇదిలా ఉండగా, దశాబ్దాల నాటి పట్టణ వరదల సమస్యను పరిష్కరించడానికి, ఎస్‌ఎన్‌డీపీ కింద రూ. 954 కోట్లతో జీహెచ్‌ఎంసీ, దాని చుట్టుపక్కల పట్టణ స్థానిక సంస్థల (ULBs) లోని మురికినీటి కాలువలను పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైదరాబాద్‌కు ప్రత్యేకమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) కూడా వచ్చింది, ఇది వర్షాల సమయంలో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతుంది.

నీటి సరఫరా…
ఒకప్పుడు ప్రతి వేసవిలో ఖాళీ కుండలతో నిరసనలు తెలిపే హైదరాబాద్‌లో ఇప్పుడు హాయిగా నీటి సరఫరా జరుగుతోంది. కేవలం కోర్ సిటీ మాత్రమే కాదు, నగరం యొక్క శివారు ప్రాంతాలు, రాబోయే రోజుల్లో నగరం విస్తర దృష్ట్యా ఆయా ప్రాంతాలు కూడా నీటి సరఫరా అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

ఓఆర్‌ఆర్‌ ఫేజ్-II ప్రాజెక్ట్ కింద 12,000 కోట్ల రూపాయలతో జీహెచ్‌ఎంసీ వెలుపల, ఓఆర్‌ఆర్‌ (ORR) పరిధిలో తాగునీటి సరఫరాను పెంచుతున్నారు. దీనికి అదనంగా రూ.1,450 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రస్తుతం 37 టీఎంసీల నీటి అవసరం ఉంది, ఇది 2072 నాటికి 70.97 టీఎంసీలకు చేరుతుందని అంచనా. ఐదేళ్లపాటు సరైన వానలు లేకపోయినా సుంకిశాల ప్రాజెక్ట్ రాజధాని నగరానికి తగినంత తాగునీటిని అందిస్తుంది.

మూసీ నది
దశాబ్దాల తర్వాత, నగరం గుండా ప్రవహించే మూసీ నది పరివాహక ప్రాంతాల రూపురేఖలు ఎట్టకేలకు మారిపోయాయి. మూసీ మరియు ఈసా నదులపై 15 వంతెనలకు రూ. 545 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది. మూసీ నది రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు.. సుందరీకరణతో పాటు కబ్జాకు గురికాకుండా చర్యలు  చేపట్టారు.

పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖాలను ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 24 అంతస్తులతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం పూర్తి చేశారు.  40 మల్టీలెవల్‌ పార్కింగ్‌ల కోసం ప్రణాళికల రూపొందించారు. మొత్తంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలిపారు సీఎం కేసీఆర్‌. పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles