24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

సీఎం కేసీఆర్‌ పయనమెటు?… జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిస్తారా?

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తన తదుపరి రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. కేసీఆర్ ఇటీవలే ఢిల్లీ పర్యటనలో అరవింద్ కేజ్రీవాల్, బెంగుళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి పొలిటికల్ హీట్‌ను పెంచేశారు. అయితే కేసీఆర్ మే నెలాఖరులో బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించాలని అనుకున్నారు. కానీ ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో జాతీయ సమ్మేళనం నిర్వహించాలన్న టీఆర్ఎస్ అధినేత ప్రణాళికకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. జూన్‌లో జరగొచ్చని అంటున్నారు. ఇక  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉత్తరాది ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసేందుకు ప్రకటనల ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం సఫలమైందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జాతీయ సమస్యలపై చర్చిస్తూ, రాజకీయ పోకడలను విశ్లేషిస్తూ ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. చైనా సరిహద్దు గాల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికులకు, ఢిల్లీ శివార్లలో జరిగిన రైతు వ్యతిరేక చట్టాలపై జరిగిన ఆందోళనలో మరణించిన రైతులకు ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రయత్నం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించారని, పార్టీకి ఎంతగానో లాభం చేకూరిందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. దేశాభివృద్ధి కోసం తన ఎజెండాను ముందుకు తీసుకురావడంలో కూడా కేసీఆర్ విజయం సాధించారని ఆయన మంత్రివర్గం కూడా కొనియాడింది.

మరోవంక “సిఎం కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదగడానికి ఒక్కొక్కటిగా పావులు కదులుతున్నారు. ఆయన ఎత్తుగడలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి” అని పార్టీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ప్రజల సమస్యలను లేవనెత్తడం ద్వారా దేశ ప్రజలను ఆకర్షించడానికి టీఆర్ఎస్ అధినేత ప్రయత్నించే అవకాశముంది.

నవంబర్ నుంచి జాతీయ రాజకీయాలకే టీఆర్ఎస్ అధినేత ఎక్కువ సమయం కేటాయిస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంగా తన జాతీయ రాజకీయాల గురించి కొన్ని పెద్ద ప్రకటనలు చేసే అవకాశం ఉందని టిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ తదుపరి రాజకీయ ఎత్తుగడపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles