23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం… కొత్తగా చేరే వారికే ఈ నిబంధన!

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను మార్పులు చేయగా, మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చే వైద్యులు సైతం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా బదిలీ ద్వారా) కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అం దరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితం గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా నియమితులయ్యే వైద్యులు, నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ వైపు బదిలీ అయిన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు. ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి నిబంధన వర్తించదు.

వైద్య పోస్టుల భర్తీ!
రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు అంశం కీలకంగా మారింది ఇప్పుడు. రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ ఆర్‌బీ) భర్తీ చేయనుంది. డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేయనుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను మాత్రం టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.

ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున్న కొత్త నియామకాలను జరుపబోతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉన్నాయని, ఇండెంట్ ఉన్న మెడిసిన్స్ కూడా కొంత మంది వైద్యులు బయటకు రాస్తున్నారని తెలిపారు. ఒకవేళ అవసరమైన మెడిసిన్స్ లేకపోతే కొనుగోలు కోసం సూపరింటెండెంట్ వద్ద నిధులు ఉంచామని అన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ సస్పెండ్ చేయలేదని, అనవసరంగా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని డిఎంఇ ఆరోపించారు.

ఇదిలా ఉండగా… ఈ కొత్త నిబంధనపై వైద్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మినిమమ్ స్ట్రెస్‌తో ఇతర దేశాల్లో అత్యుత్తమ జీతభత్యాలతో అనేక అవకాశాలు ఉన్నాయని ఓ వైద్యుడు తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ చేసిన వాళ్లంతా ఇప్పుడు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారని ఆయన అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles