24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ ఏర్పాటు… డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి!

హైదరాబాద్: రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఎం మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐ.టి సంస్థలు, ఐఐటీ, ఐబీఎం లాంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సేలన్స్ ను త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.

గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో సైబర్‌ సేఫ్టీ అండ్‌ నేషనల్‌ సెక్యురిటీపై శనివారం జరిగిన ఒకరోజు జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 800 కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్‌ల నుండి శిక్షణ పొందిన పోలీసు అధికారులను సైబర్ వారియర్‌లుగా డిపార్ట్‌మెంట్ నియమించింది.

జిల్లా, కమిషనరేట్, రాష్ట్ర స్థాయిలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగాలను ఏర్పాటు చేశామని మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో సెల్‌ఫోన్ వినియోగదారులు మరో మూడేళ్లలో బిలియన్లకు చేరుకుంటారని పేర్కొన్న డీజీపీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ మాధ్యమంలో భాగమయ్యారని, అందుకే సైబర్ క్రైమ్‌లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. సైబర్ నేరాలు వ్యక్తులకే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వ్యాపారాలు, వాణిజ్యం, సేవా రంగాలకు కూడా ముప్పుగా పరిణమించాయని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు.

ఈ సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు మొత్తం పోలీస్ వ్యవస్థ నే పటిష్ట పరుస్తున్నామని, ఇందులో భాగంగా, ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ కోర్దినేషన్ సెంటర్ (టి 4 సి) ను ప్రారంభించామన్నారు. ఇది నేర నిరోధంలో కీలక పాత్ర వహిస్తోందని తెలిపారు. దేశంలోని ఆర్థిక పరమైన వ్యవహారాలన్నీ డిజిటలైజ్ చేయడంతో ఇదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. ఇటీవల నగరంలో ఒక బ్యాంక్ ద్వారా రూ.20కోట్లు తరలించిన అంశాన్ని ఉదహరిస్తూ మరో పదేళ్ళలో ఎదురయ్యే సైబర్ క్రైమ్‌లను గుర్తించి వాటి కనుగుణంగా తగు నివారణను సూచించేందుకు ఈ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ పనిచేస్తుందన్నారు.

సైబర్ నేరాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మొత్తం పోలీసు శాఖను పటిష్టం చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల నివారణపై అవగాహన పోస్టర్లను మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles